రాప్తాడు రూరల్/కుందుర్పి: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ రైతు నిండు ప్రాణం బలైంది. పండించిన పంటను అమ్ముకుని కుటుంబానికి ఆధారం కావాలనే ఆశతో వచ్చిన అన్నదాత అదే మార్కెట్ యార్డులో ప్రాణాలు కోల్పోవడం చూపరులను కలచివేసింది.
వివరాలు..కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రన్న (66) తన పొలంలో పండించిన మామిడి కాయలను బొలెరో వాహనంలో తీసుకుని కక్కలపల్లి గ్రామంలోని టమాట మండీకి వచ్చాడు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మార్కెట్‌లో సరుకు ఉంచి, మరుసటి రోజు ఉదయం వేలంలో పాల్గొనేందుకు అక్కడే వేచి ఉంటూ బహిరంగ ప్రదేశంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో టీఎస్ 07 ఈయూ 3699 నంబరు గల చావర్లెట్ క్రూజ్ కారును డ్రైవర్ రివర్స్ చేస్తూ నిద్రిస్తున్న చంద్రన్నను గుర్తించకుండా అతని మీదుగా దూసుకెళ్లాడు. ఘటనలో చంద్రన్న తొడలు, నడుం భాగం తీవ్రంగా నలిగిపోయాయి. క్షతగాత్రుడిని ఆగమేగాలపై స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పీఎస్ ఎస్‌ఐ రాంబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
మార్కెట్ యార్డులో రివర్స్‌లో వచ్చి
పడుకున్న రైతు మీద దూసుకెళ్లిన కారు
నిద్రలోనే కన్నుమూత


