● వైద్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం
● ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ
● పట్టించుకోని సర్వజనాస్పత్రి అధికారులు
● కుందుర్పి మండలం ఎనుమలదొడ్డి గ్రామానికి చెందిన హరిజన మారెక్క (70) జ్వరం, విరేచనాలతో బాధపడుతుండటంతో శుక్రవారం అనంతపురం సర్వజనాస్పత్రి ఎఫ్‌ఎం వార్డులో చేర్చారు. శనివారం మధ్యాహ్నం ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలాసేపటి తర్వాత అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి ఆమె మృత్యువాత పడింది. డాక్టర్లు సకాలంలో స్పందించకపోవడంతోనే మృతి చెందారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 7 గంటలైనా ‘మహా ప్రస్థానం’ వాహనం అందుబాటులోకి రాలేదు. ఇలాంటి ఘటనలు సర్వజనాస్పత్రిలో నిత్యకృత్యం అయ్యాయి.
అనంతపురం: మెరుగైన వైద్య సేవలతో రోగులకు సాంత్వన చేకూర్చాల్సిన వైద్యాలయం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో వేదనాలయంగా మారింది. ఉమ్మడి జిల్లాకు అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. సాధారణ రోగులతో పాటు ప్రమాద బాధితులు, అత్యవసర వైద్యం కోసం వేల సంఖ్యలో వస్తుంటారు. వైద్యులు, వైద్య నిపుణులు, విభాగాధిపతులు, సిబ్బంది కొరత లేదు. తగినంత జీతాలు అందుతున్నా కొందరిలో అంకిత భావం కొరవడుతోంది. అవుట్ పేషంట్ సేవల కోసం వచ్చే రోగులకు ‘అభా’ రిజిస్ట్రేషన్ పేరుతో సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేకంగా ఓపీలు ఇవ్వడానికి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ‘అభా’ రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేకంగా కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయని చెబుతున్నా.. అవి ఎక్కడున్నాయో తెలియని దుస్థితి.
అతిథి పాత్రలో వైద్యులు
సర్వజనాస్పత్రి వైద్యుల్లో చాలామంది అతిథి పాత్ర పోషిస్తున్నారు. నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా రావడం.. ముందుగా వెళ్లిపోవడం చేస్తున్నారు. సొంత క్లినిక్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రోగులు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.
పీజీలే దిక్కే
బోధనాస్పత్రి అయిన సర్వజనాస్పత్రిలో మొత్తం 21 విభాగాల్లో పీజీ వైద్యులు ఉన్నారు. ఆయా విభాగాల్లో పీజీలపైనే భారం మోపి సీనియర్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఎమెర్జెన్సీ వార్డుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసుల పట్ల సీనియర్ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పీజీలకు ఫోన్ ద్వారా సలహాలు ఇస్తూ వారు సొంత ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిమగ్నమైపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన కేసుల్లోనూ సీనియర్ వైద్యులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. వైద్యులు తప్పులమీద తప్పులు చేస్తున్నా సర్వజనాస్పత్రి ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో రోగుల వేదన అరణ్య రోదనగా మిగులుతోంది.


