● బెంబేలెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్: మునుపెన్నడూ లేనివిధంగా సూరీడు తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుండటంతో హే‘భగ’వాన్ అంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉష్ణోగ్రతలు ఏ మాత్రమూ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం ‘సన్’ స్ట్రోక్ మరింత పెరిగింది. తాడిపత్రి, కళ్యాణదుర్గం ప్రాంతంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో 15 రోజులుగా ‘అనంత’ అగ్నిగుండంలా మండుతోంది. వైశాఖ మాసానికి సార్థకత చేకూరుస్తూ సూరీడు జనానికి ముచ్చెటమలు పట్టిస్తున్నాడు. జిల్లా అంతటా గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 డిగ్రీల నుంచి 31 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో రాత్రిళ్లు కూడా తీవ్ర ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా రాగల మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. దాదాపు పొడి వాతావరణం ఉంటుందని, ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చన్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు.


