ప్రశాంతంగా ముగిసిన ఎంజేపీ సెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఎంజేపీ సెట్‌

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

ఉరవకొండ/కుందుర్పి: జిల్లాలో అత్యంత ప్రాతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల జూనియర్‌ కళాశాల (ఎంజేపీ జేసీ) సెట్‌–2026 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల జూనియర్‌ గురుకుల కళాశాలలో నిర్వహించిన పరీక్షలకు 490 మంది విద్యార్థులు కేటాయించారు. అందులో 387 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ జాన్సీరాణి తెలిపారు. కుందుర్పి పాఠశాల ప్రిన్సిపాల్‌, జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్‌ జీ. అస్రత్‌ అలీ విలేకరులతో మాట్లాడారు. ఆదివారం కొనకొండ్ల, నార్పల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు నార్పల, గుమ్మగట్ట, హీరేహాళ్‌, కుందుర్పి, కొనకొండ్ల, లేపాక్షి, పేరూరు, నసనకోట తదితర పాఠశాలల నుంచి 776 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 645 మంది విద్యార్థులు హాజరుకాగా 131 మంది గైర్హాజరయినట్లు ఆయన తెలిపారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

తాడిపత్రి రూరల్‌: మండలంలోని కోమలి రైల్వేస్టేషన్‌ పరిధిలో రైలు పట్టాల పక్కన నాగేంద్ర (45) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అప్‌గ్రేడ్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. కోమలి గ్రామానికి చెందిన నాగేంద్రకు భార్య, పిల్లలు ఉన్నారు. మేకలు మేపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుభకార్యం నిమిత్తం అత్తవారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లిన నాగేంద్ర.. తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన నాగేంద్ర తాను కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్నానని, పిల్లలను సరిగా చూసుకోవాలని తమ్ముడు సురేంద్రకు ఫోన్‌ చేశాడు. ఆందోళనతో సోదరుడు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా రైల్వే పట్టాల పక్కన విగతజీవిగా పడి ఉన్నాడు. శవాన్ని పరిశీలించగా తలకు రెండు చోట్ల గాయాలు అయ్యి ఉన్నాయి. అనుమానంతో సోదరుడు అతన్ని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే నాగేంద్ర మృతిచెంది ఉన్నాడు. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నాగేంద్రను హత్య చేసి ఉంటారని తమ్ముడు సురేంద్ర పోలీసులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

మహిళా వికాసానికి

కాంగ్రెస్‌ అడ్డు

మంత్రి సత్యకుమార్‌

అనంతపురం టవర్‌క్లాక్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌తో సహా విపక్షాలు వ్యతిరేకించి మహిళా వికాసానికి అడ్డుపుల్ల వేశాయని.. అయినా చర్చలు జరిపి గెలిచే తీరుతామని మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించి ఆ వర్గాలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాడతామన్నారు. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులు ఆమోదం పొందితే మహిళలు రాజకీయంగా ఎదిగేవారన్నారు.

బంగారు గొలుసు అపహరణ

బత్తలపల్లి: శుభకార్యానికి వెళ్లి బ్యాగు చూసుకోగా, అందులో ఉన్న

బంగారు గొలుసు కనిపించలేదని బాధితులు నాగమోహన్‌, భూమిక దంపతులు ఆవేదన చెందారు. వివరాలు.. ముద్దనపల్లికి చెందిన నాగమోహన్‌, భూమిక దంపతులు నార్పల మండలం గొల్లపల్లికి ఓ శుభకార్యానికి వెళ్లేందుకు బత్తలపల్లికి వచ్చారు. తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులో వెళ్లారు. అక్కడికెళ్లిన తర్వాత బ్యాగులో ఉన్న మూడున్నర తులాల బంగారు నెక్లెస్‌ కనిపించలేదు. అయితే అదే బ్యాగులో ఉన్న జత కమ్మలు, చిన్నపాటి గొలుసు ఉందని బాధితులు తెలిపారు. అనంతరం బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం

బత్తలపల్లి: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యాడని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి ఆదివారం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. జలాలపురానికి చెందిన బి.శివయ్య, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నెల్లూరులో బీటెక్‌ చదువుతున్నాడు. రెండో కొడుకు జగదీష్‌ ధర్మవరంలోని మోడల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యాడు. మాట్లాడుతూ వచ్చే ఏడాదైనా బాగా చదివి మంచి ఫలితాలు తెచ్చుకోవాలని సూచించారు. మనస్థాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement