అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఈనెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐదుగురు సభ్యులు కూడా హాజరవుతారని ఎస్సీ సంక్షేమశాఖ ఉప సంచాలకులు కుస్బూ కొఠారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. 2 గంటల నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.
బయన్నపేటలో యువకుడిపై దాడి
బుక్కరాయసముద్రం: మండలంలోని దయ్యాలకుంటపల్లి వద్దనున్న బయన్నపేటలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమార్తె వివాహం త్వరలో జరగబోతుండగా, ఇల్లు శుభ్రం చేసే పనులు చేస్తున్నారు. రామాంజనేయులు కొడుకు గణేష్ స్థానికంగా ఉన్న కొళాయి వద్ద నీరు పట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, సూరి అక్కడ ఘర్షణ పడ్డారు. గణేష్‌పై శ్రీకాంత్, సూరి కర్రలతో భౌతికదాడికి దిగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై మూడోదశ
పోరాటానికి రంగం సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మూడోదశ పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న జిల్లా ప్యాప్టో నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపత్రాలు విడుదల చేశారు. నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్ర ఫ్యాప్టో కమిటీ ఇచ్చే ప్రతి పిలుపును విజయవంతం చేస్తామని తీర్మానించారు. 25న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలు ఉంటాయన్నారు. సమావేశంలో ప్యాప్టో చైర్మన్ శ్రీనివాస నాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, సభ్యులు రమణారెడ్డి, వెంకటరత్నం, కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు శంకరమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
పుట్లూరు: రంగమనాయునిపల్లిలో శనివారం రాత్రి వీరేంద్ర (26) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన వీరేంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. కూలి పనులకు వెళ్లి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగుతున్న విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో గ్రామంలోని తన మేనమామ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన బంధువులు వెంటనే తలిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు తండ్రి ఓబులేషు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


