అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖది ప్రత్యేకస్థానం. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఇక్కడి అధికారుల నుంచి సలహాలు, సూచనలు ముఖ్యంగా పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధానాలను తెలుసుకుంటారు. ఇలా ఇతర శాఖలకు మార్గదర్శకంగా ఉండే రెవెన్యూశాఖ.. ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో సరైన న్యాయం చేయలేకపోతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ (జేఏ)లకు సీనియర్ అసిస్టెంట్(ఎస్‌ఏ)లుగా పదోన్నతి కల్పన అర్హులైన ఉద్యోగులకు ఎండమావిలా మారింది. సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన ప్రతిసారీ లోపాలు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో అధికారుల నిర్వాకం కారణంగా ఏకంగా పదోన్నతుల కల్పన ఫైలు అనుమతి కోసం సీసీఎల్‌ఏకు చేరింది. ఇలాంటి పరిస్థితి రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ చూడలేదని పలువులు ఉద్యోగులు చెబుతుండడం గమనార్హం.
65 ఎస్‌ఏ పోస్టుల ఖాళీ..
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను అనంతపురం నుంచే నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖలో దాదాపు 65 సీనియర్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) ఉమ్మడి జిల్లాలో 40 మంది వరకు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఫైలు.. సీసీఎల్‌ఏ పరిధిలోకి..
జేఏలకు పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా లోపభూయిష్టంగా సిద్ధమవుతుండడంతో ప్రక్రియకు ప్రతిసారి ఆటంకం వస్తోంది. పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతి ఏడాది అప్‌డేషన్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ 2020–21 వరకు అప్‌డేషన్ జరిగింది. ఆ తరువాత నుంచి జరగలేదు. అప్‌డేషన్ ఐదేళ్ల లోపు ఉంటే పదోన్నతులు కల్పించడం కలెక్టర్ పరిధిలో ఉంటుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే 2021–22, 2022–23, 2023–24, 2024–25, 2025–26 ఇలా ఐదేళ్లు అప్‌డేషన్ చేయలేదు. ప్రస్తుతం 2026–27 ఆర్థిక సంవత్సరం నడుస్తోంది. అప్‌డేషన్ జరగక ఐదేళ్లు దాటడంతో సీసీఎల్‌ఏ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేషన్ చేసుకుంటూ ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. పదోన్నతులు పొందేందుకు ఇలా సీసీఎల్‌ఏ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థతి గతంలో ఎన్నడూ రాలేదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు
ఉమ్మడి జిల్లాలో 65 ఎస్‌ఏ పోస్టులు ఖాళీ
అధికారుల నిర్వాకంతో సీసీఎల్‌ఏకు ఫైలు
అర్హులైన 40 మంది జేఏల ఎదురుచూపు
ఈ పరిస్థితి చరిత్రలో
ఎన్నడూ లేదంటున్న ఉద్యోగులు
నిరాశా నిస్పృహలో ఉద్యోగులు..
ఉద్యోగులు తమ సర్వీస్‌లో ఆశించేది పదోన్నతి. అయితే పదోన్నతి కల్పించడంతో జాప్యం జరిగితే ఆ ప్రభావం ఉద్యోగి పనితీరుపై పడుతుంది. అర్హత ఉండీ అధికారుల నిర్వాకం కారణంగా ఏళ్లుగా పదోన్నతి పొందలేకపోతున్న జూనియర్ అసిస్టెంట్లు తీవ్ర నిరాశా నిస్పృహతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న ఉద్యోగుల నుంచి నాణ్యమైన సేవలు అందవనే అభిప్రాయం సీనియర్ ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది.


