సాక్షి టాస్క్‌ఫోర్స్: రాయదుర్గం నియోజకవర్గం డీహీరేహాళ్ మండలంలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్‌చేసిన విలువైన ఇనుప ఖనిజాన్ని ఓ ‘పచ్చ’ముఠా చీకటి మాటున తరలించినట్టు సాక్షాధారాలతో కొందరు సోషల్‌మాధ్యమాల్లో వైరల్ చేశారు. ముడి ఇనుము అక్రమంగా తరలిస్తుండగా ఈ నెల 3న కర్ణాటక పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినట్టు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే చోరీకి పాల్పడి సమీప ఐరన్‌ఓర్ ఫ్యాక్టరీలో విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు ఉన్నాయి. కర్ణాటకలో కేసులు నమోదైతే ఇక్కడి అధికారులు దృష్టి సారించకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తరచూ మైనింగ్ దోపిడీ వ్యవహారం తెరకెక్కుతున్నా సంబంధిత అధికారులు నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మైనింగ్ దొంగలు కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని బీఎస్‌పీ నాయకుడు చిందనూరు నాగరాజు ఆరోపించారు.
ఎన్‌ఎండీసీలోనూ ఖనిజం చోరీ?
కర్ణాటక రాష్ట్రం సండూరు పరిసరాల్లో ఉండే ఎన్‌ఎండీసీలోనూ ఖనిజం దోపిడీ జరిగింది. ఈ వివరాలు వైరల్‌గా మారాయి. ఎంతో భద్రతా వలయం మధ్యనున్న ఎన్‌ఎండీసీలో అక్రమంగా తవ్వకాలు జరిపిన ముడి ఇనుమును నేమకల్లు సమీపాన ఓ స్పాంజ్ ఐరన్‌ఓర్ ఫ్యాక్టరీకి తరలించినట్టు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేసి ఫ్యాక్టరీలోనూ సోదాలు జరిపినట్టు తెలిసింది. ఈ వివరాలను బళ్లారి ఎస్పీ రెండు రోజుల క్రితం మీడియాకు వెల్లడించారు. స్థానిక అధికారులు అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఎందుకు దృష్టి సారించలేదని రాజకీయపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవాలు నిగ్గుతేల్చి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని బీఎస్‌పీ నాయకుడు చిందనూరు నాగరాజు ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.


