ఐసీడీఎస్ పీడీగా శశికళ
అనంతపురం సెంట్రల్: ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా రాయచోటి సీడీపీఓ శశికళ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఫిబ్రవరిలో వైఎస్సార్ జిల్లా బద్వేలు సీడీపీఓగా పనిచేస్తున్న ఎం.శ్రీదేవికి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. ఫిబ్రవరి 26న ఆమె బాధ్యతలు చేపట్టారు. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా తనను ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆమె విజ్ఞప్తి మేరకు బాధ్యతల నుంచి తప్పించి.. రాయచోటి సీడీపీఓ శశికళను పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గతంలో తాడిపత్రి, కదిరి, హిందూపురం తదితర ప్రాజెక్టుల్లో సీడీపీఓగా పనిచేసిన అనుభవం ఉంది. త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఐసీడీఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి.
మహిళా ఓటర్లే అధికం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని 577 గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు శనివారం ప్రకటించారు. పంచాయతీరాజ్ చట్టం–1994 నిబంధనల ప్రకారం, 2026 ఏప్రిల్ 15 నాటికి ఈ వివరాలను ఖరారు చేసినట్లు డీపీఓ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 577 గ్రామ పంచాయతీలు, 5,748 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 13,65,922 మంది ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు 6,78,302 మంది, మహిళా ఓటర్లు 6,87,494 మంది ఉన్నారు. ఇతరులు 126 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. మొత్తం మీద మహిళా ఓటర్లు 9,192 మంది ఎక్కువగా ఉన్నారు. ఈ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు డీపీఓ తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యామండలి మార్చి–2026 ఫలితాల అనంతరం విద్యార్థులకు ఇంప్రూమెంట్ అవకాశంపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి సబ్జెక్టుల వారీ ఉత్తమ మార్కుల విధానంతో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐఓ) వెంకటరమణనాయక్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ (ఐపీఏఎస్‌ఈ) మే–2026లో పాస్ అయిన పేపర్లలో ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా పాస్ అయిన సబ్జెక్టుల్లో ఇంప్రూమెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇంప్రూవ్‌మెంట్ రాసిన అనంతరం ఎక్కువ మార్కులను (ఉత్తమ మార్కులు) పరిగణనలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. అయితే ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూమెంట్ అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన పేపర్లకు విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఎన్నిమార్లు అయినా హాజరుకావచ్చని తెలిపారు.
పెద్దవడుగూరు : గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ పెద్దవడుగూరులో పర్యటించారు. పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత పెద్దవంకలో ‘జలధార–జలహారతి’ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో ఇంకుడు గుంతకు భూమి పూజ నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన రూట్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో కురిసిన ప్రతి వర్షపు చుక్కనూ భూమిలోకి ఇంకిపోయేలా చూడాలన్నారు. నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకులు, కుంటలు, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలో మూడు లక్షల హెక్టార్లకు పైగా పంటల సాగు ఎక్కువగా వర్షంపైనే ఆధారపడి ఉందన్నారు. తక్కువ నీటితో పంటలు పండించే అంశంపై దృష్టి సారించాలన్నారు. పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా పదో తేదీలోపు నమోదు చేయాలన్నారు. వివరాలు తప్పుగా నమోదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


