● కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ కార్యకర్త
అనంతపురం టౌన్: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలనే ఇష్టానుసారం అసభ్యపదజాలంతో దూషిస్తూ దాడులు చేయిస్తావా.. అంటూ అనంతపురం అర్బన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త విశ్వ వాపోయారు. ఎమ్మెల్యే దగ్గుపాటి తనపై దాడి చేయించాడంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన వీడియో వైరల్ అయ్యింది. హౌసింగ్ బోర్డులో ఓ స్థల వివాదంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి ‘ఏరా లం.. .కా.. చెప్పుతో కొడతా’ అంటూ తనను దుర్భాషలాడడంతోపాటు తన అనుచరులతో దాడి చేయించాడంటూ ఆరోపించారు. ‘పార్టీని నమ్ముకున్న వారిపై దాడులు చేయిస్తావు? నీ మాట వినకుంటే వైన్ షాపులను తగలబెట్టిస్తావు? ఇదేనా నీవు కార్యకర్తలకు ఇచ్చే విలువ’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇలా చేయలేదంటూ దగ్గుపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా గురించి కాలవ శ్రీనివాసులును అడుగు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు.. అనుచరులు ఉండొచ్చు. అంతమాత్రాన కార్యకర్తలపై దాడులు చేస్తారా.. ఇదెక్కడి నీతి.. నీలాంటి ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు మళ్లీ సీఎం కాలేడు. నీలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యి పార్టీని నాశనం చేస్తున్నారు. నేను చనిపోతే నువ్వే కారణం దగ్గుపాటి ప్రసాద్’ అంటూ విశ్వ విలపించారు.


