ఈదురుగాలులకు నేలవాలిన అరటి (ఫైల్)
అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు గతి తప్పాయి. సకాలంలో కాకుండా అకాలంలో అధిక వర్షాలు కురవడం, పంట దిగుబడులు అరకొరగా రావడం, వచ్చిన ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులకు వ్యవసాయం భారంగా పరిణమించింది. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంట నష్టం భారీగా జరిగినా నిబంధనల మేరకు ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిహారం ఇవ్వడానికి కూడా వెనకాడుతుండటం రైతులను కలిచివేస్తోంది. ఈ ప్రభుత్వ హయాంలో గత నాలుగు సీజన్లలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుశనగతో పాటు అరటి, మామిడి, చీనీ, టమాట, ఇతర కూరగాయల పంటలు వేల హెక్టార్లలో దెబ్బతినడంతో రూ.950 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల మేరకు రూ.115 కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. 2024 ఖరీఫ్‌లో ఏడు, రబీలో ఏడు మండలాలను కరువు జాబితాలో ప్రకటించినా... వాటికి కూడా ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం వ్యవసాయ, ఉద్యాన రైతులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కరుణించకపోవడం గమనార్హం.
అందని ‘పంట నష్ట ఉపశమనం’
ఆగస్టు 2024 నుంచి అమలులోకి వచ్చిన స్కేల్ ఆఫ్ రిలీఫ్ (పంట నష్ట ఉపశమనం) ప్రకారం వేరుశనగ, పత్తి, వరి, చెరకు హెక్టారుకు రూ.25 వేల ప్రకారం లెక్కకట్టి ఇస్తారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, కుసుమ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, కొర్ర, సామ, జూట్ పంటలు హెక్టారుకు రూ.15 వేల ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. అలాగే అరటి, మామిడి, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా, రేగు, డ్రాగన్‌ఫ్రూట్, జీడిపప్పు, కాఫీ, పసుపు, మిరప హెక్టారుకు రూ.35 వేలు, కళింగర, కర్భూజ, దోస, బొప్పాయి, టమాట, పూలు, ఉల్లి, ధనియాలు, కూరగాయలకు రూ.25 వేలు, సెంటు విస్తీర్ణంలో ఉన్న ఆకుతోటలకు రూ.300 ప్రకారం గరిష్టంగా రూ.75 వేల వరకు ఇస్తారు. కర్ర పెండలం రూ.10 వేలు, ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ ఖరారు చేశారు. అయితే 2 ఖరీఫ్– 2 రబీ మొత్తం నాలుగు వ్యవసాయ సీజన్లు ముగిసినా పంటనష్టపోయిన రైతులెవ్వరికీ పంటనష్ట ఉపశమన సాయం అందలేదు.
జగన్ హయాంలో రూ.380 కోట్ల సాయం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించిన 2019–2024 మధ్య కాలంలో మొదటి నాలుగేళ్లూ విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే మధ్య మధ్యలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, అలాగే చివరి ఏడాది కాస్త వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏ సీజన్‌లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్ ముగిసేలోపు పెట్టుబడిరాయితీ పరిహారం ఇస్తూ వచ్చారు. అలా ఐదేళ్ల హయాంలో ఏకంగా రూ.380.20 కోట్లు అందించారు. అందులో వ్యవసాయ పంటలకు సంబంధించి 2,65,290 మంది రైతులకు రూ.364.85 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి 8,997 మంది రైతులకు రూ.15.35 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేశారు.
గత రెండేళ్లుగా కరువు, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం
రూ.115 కోట్ల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దాటవేత
సాయం కోసం వ్యవసాయ, ఉద్యాన రైతుల ఎదురుచూపులు


