అడుగంటుతున్న భూగర్భజలాలు | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతున్న భూగర్భజలాలు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో భూగర్భజలాల స్థితిగతులు గతి తప్పే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత వర్షపాత సంవత్సరంలో ఒకటీ అర మినహా భారీ వర్షాలు లేకుండా మోస్తరు వర్షాలతో వరుణుడు సరిపెట్టడంతో తగ్గుదల నమోదవుతున్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భజలశాఖ తాజాగా సేకరించిన లెక్కల ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 12.14 మీటర్లుగా నమోదైంది. గత ఐదేళ్ల కాలంలో ఇదే గరిష్టం కావడం విశేషం. తాజా గణాంకాలను పరిశీలిస్తే... 19 మండలాల్లో నీటి మట్టం తగ్గుదల నమోదు కావడం విశేషం.

డేంజర్‌లో నాలుగు మండలాలు

సరైన వర్షాలు లేకపోవడం, నీటి వినియోగం అధికంగా ఉండటం వల్ల కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు మండలాలు ‘డేంజర్‌ జోన్‌’లోకి వెళ్లినట్లు ఆ శాఖ అధికారులు నివేదించారు. ఈ నాలుగు మండలాల్లో 20 మీటర్లు అంతకన్నా ఎక్కువ లోతులోనే భూగర్భజలాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. వీటితో పాటు అనంతపురం రూరల్‌, గుత్తి, యల్లనూరు, శింగనమల, బ్రహ్మసముద్రం, కూడేరు, గుమ్మఘట్ట, రాయదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, తాడిపత్రి, డి.హీరేహాళ్‌, పామిడి, కణేకల్లు, పుట్లూరు మండలాల్లో కూడా భూగర్భజల మట్టం కనిష్టంగా 8 మీటర్లు, గరిష్టంగా 20 మీటర్ల లోతులో కనిపిస్తూ తగ్గుదల నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. కుందుర్పి మండలం ఎర్రగుంట ఫిజోమీటర్‌లో 44.35, యాడికి మండలం నగరూరులో 42.08, పుట్లూరులో 35.60 మీటర్ల లోతుకు పతనమైనట్లు గుర్తించారు.

సాధారణ వర్షపాతమే

ఈ ఏడాది జిల్లాలో 470 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ ఐదారు మండలాల్లో మాత్రమే భారీ వర్షాలు కురవగా... మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి నమోదయ్యాయి. ఎక్కడా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు, నదీ పరివాహక ప్రాంతాలు పెద్దగా ప్రవహించకపోవడం వల్ల భూగర్భజలాలు తగ్గుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. గత ఐదారేళ్లతో పోల్చితే ఈ ఏడాది 40 వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదు కావడంతో నీటి మట్టం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గతేడాది 62 వర్షపు రోజులు, అంతకు మునుపు నాలుగేళ్లూ 70 నుంచి 80 వరకు రెయినీడేస్‌ నమోదయ్యాయి. ఈ ఏడాది వర్షం రూపంలో 165 టీఎంసీల వరకు నీటి ప్రవాహం ఉండగా.. అందులో 19.74 టీఎంసీలు మాత్రమే భూగర్భంలోకి ఇంకాయి.

ఎల్‌–నినో హెచ్చరికతో ఆందోళన

ఈసారి నైరుతి రుతుపవనాలపై ‘ఎల్‌–నినో’ ప్రభావం ఉంటుందని భారత వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు తక్కువగా నమోదయ్యే పరిస్థితి ఉందని చెబుతుండటంతో మున్ముందు భూగర్భజలాలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రధానంగా ఉద్యాన పంటల మీద ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు హంద్రీ–నీవా కాలువకు చంద్రబాబు సర్కారు లైనింగ్‌ చేయడంతో భూగర్భజలాలు తగ్గుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ఎల్‌–నినో’ కారణంగా అధిక నీటి వినియోగం కలిగిన వరి లాంటి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచనలు చేస్తున్నారు.

‘డేంజర్‌’లో కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు

జిల్లా తాజా సగటు నీటి మట్టం 12.14 మీటర్లుగా నమోదు

ఎల్‌–నినో హెచ్చరికతో ఆందోళన రేకెత్తిస్తున్న పాతాళగంగ

Advertisement
 
Advertisement
Advertisement