ఉగ్రరూపం దాల్చిన భానుడు | - | Sakshi
Sakshi News home page

ఉగ్రరూపం దాల్చిన భానుడు

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

జిల్లా అంతటా మండుతున్న ఎండలు

జన జీవనం స్తంభించేలా వేసవితాపం

నేటి నుంచి వైశాఖం.. పొయ్యిశాకమే

అనంతపురం అగ్రికల్చర్‌: భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా అగ్నిగుండంలా తయారైంది. శుక్రవారం ఏకంగా 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో ఈ మేరకు ఉష్ణోగ్రత రికార్డయింది. పుట్లూరు 43.2, యల్లనూరు 42.8 డిగ్రీల నమోదుతో పాటు పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, విడపనకల్లు, నార్పల తదితర నల్లరేగడి భూములు కలిగిన మండలాల్లో వేసవితాపం అధికంగా ఉంది. మిగతా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య సూరీడు బెంబేలెత్తిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాత్రింబవళ్లు ఉక్కపోతతో పాటు 8 కిలోమీటర్ల వేగంతో కూడిన వడగాల్పులతో జనం మాడిపోతున్న పరిస్థితి నెలకొంది.

● ఇక శనివారం నుంచి వైశాఖ మాసం మొదలు కానుండటంతో పొయ్యి శాకం మాదిరిగా ఎండలు మరింత దంచికొట్టే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఎండలకు రోళ్లు కూడా పగులుతాయన్నట్లు చెబుతున్న రోహిణీకార్తె కూడా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మండువేసవి తీవ్రస్థాయిలో ఉండటం గమనార్హం. గ్లోబల్‌ వార్మింగ్‌, అలాగే ఎల్‌–నినో కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. రేపోమాపో 45 డిగ్రీల మార్క్‌ చేరుకునే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారత వాతా వరణశాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసింది.

జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకపోవడం మేలు. అది ఎండకు చాలా కీలక సమయమని చెబుతున్నారు. పనులన్నీ ఉదయం, సాయంత్రం చేసుకుంటే ఉత్తమం. బయటకు వెళ్లాల్సివస్తే టోపీ, గొడుగు, తలపాగా, తడి టవల్‌, గ్లౌజులు, కూలింగ్‌ గ్లాసులు వాడాలి. వదులుగా ఉండే లైట్‌ కలర్‌ దుస్తులు ధరించాలి. నల్లటి దుస్తులు, టైట్‌గా ఉన్నవి వాడకూడదు. రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగాలి. ప్రతి గంటకూ ఒక గ్లాసు నీళ్లు లేదా మజ్జిగ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, గ్లూకోజ్‌, పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లరసాలు మంచివి. కూల్‌డ్రింక్స్‌, ఆల్కహాల్‌, కాఫీ, టీ లాంటివి తగ్గించాలి. పెరుగన్నం, కూరగాయలు, లైట్‌గా ఫుడ్‌ తీసుకోవాలి. ఆయిల్‌ఫుడ్‌, మసాలాలు, చికెన్‌, మటన్‌, బిర్యానీ, ఆయిల్‌ ఫుడ్స్‌ తగ్గించాలి. వీటి వల్ల బాడీ హీట్‌ పెరుగుతుంది. ఇంట్లో కిటికీలకు తడిబట్టలు కట్టుకుంటే మేలు. అప్పుడప్పుడు ముఖం, కాళ్లు కడుక్కోవాలి. పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్‌, ఇతరత్ర జబ్బులున్నవాళ్లు, రైతులు, శ్రామికులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాంతులు, తలతిరగడం, జ్వరం, చెమట పట్టకపోవడం, ఫిట్స్‌ లాంటి వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

శుక్రవారం ఎండలకు నిర్మానుష్యంగా ఉన్న అనంతపురం శివారులోని రుద్రంపేట రహదారి

అనంతపురంలో ఎండ వేడి తాళలేక

తక్కెడ గిన్నె తలపై పెట్టుకున్న మహిళ

Advertisement
 
Advertisement
Advertisement