విడపనకల్లు: హావళిగి గ్రామానికి ఎట్టకేలకు సురక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధరించారు. కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల దుస్థితిని ‘నీరిలా.. తాగేదెలా..?’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురించిన విషయం విదితమే. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, ఈఈ శ్రీనివాసులు స్పందించి శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. బొల్లనగుడ్డం నుంచి తాగునీరు సరఫరా అయ్యే పైపులైన్ పగలడం వల్ల నీరు కలుషితమవుతుండటాన్ని గుర్తించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి తాగునీటిని వదిలారు. నీరు శుభ్రంగా ఉందని గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ అంజుమన్, ఏఈఈ ముజమ్మిల్, డిప్యూటీ ఎంపిడీఓ భాస్కర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రగతితో సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పారిశ్రామిక ప్రగతి ద్వారానే జిల్లా సమాగ్రాభివృద్ధి సాధిస్తుందని కలెక్టర్ ఆనంద్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో వివిధ దశల్లో ఉన్న పరిశ్రమల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు. 2025లో జరిగిన భాగస్వామ్య సదస్సు, ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పరిశ్రమలు, ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆమోదించిన ప్రాజెక్టుల మీద సమీక్షించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ పథకాల ద్వారా అర్హులైన వారి నుంచి నాణ్యతగల పథకాలను ఎంపిక చేయాలని పరిశ్రమల శాఖ అధికారిని ఆదేశించారు. ఆయా పథకాల కింద విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా ఆర్‌ఏఎంపీ కింద నిర్వహించాల్సిన ఉద్యమ్, ఈఎస్‌డీపీ, వీడీపీ, జెడ్, తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ కింద యూనిట్లకు రాయితీలు కల్పించారు. సమావేశంలో పరిశ్రమల అధికారి శ్రీనివాసయాదవ్, ఏపీఐఏసీ జెడ్‌ఎం నాగకుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, ఏసీటీఓ కృష్ణారెడ్డి, డీటీసీ వీర్రాజు, ఎల్‌డీఎం హేమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి
అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా పి.విజయలక్ష్మి నియమితులయ్యారు. గుంతకల్లు డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న ఆమెను జెడ్పీ రెగ్యులర్ సీఈఓగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమె గతంలో డ్వామా ఏపీడీగా పనిచేస్తూ ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీగా పని చేశారు.
రేపు క్రికెట్ మహిళా జట్లఎంపిక
అనంతపురం: సీనియర్, అండర్–15 (ఉమెన్) క్రికెట్ జట్ల ఎంపిక ఆదివారం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఈ మేరకు క్రికెట్ కోచ్ ఆర్.కుమార్ శుక్రవారం వెల్లడించారు. అండర్–19కు సెప్టెంబర్ 1, 2007 తరువాత జన్మించిన వారు, అండర్–15కు సెప్టెంబర్ 1, 2011 తరువాత పుట్టిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లతో ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించే ఎంపిక పోటీలకు ఆసక్తి గల వారు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 99630 74220 లో సంప్రదించాలని కోరారు.


