● జర్నలిస్టులకు కలెక్టర్ ఆనంద్ సూచన
● మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సహకారం
అనంతపురం అర్బన్: పని ఒత్తిడిలో ఉన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ వహించాలని వర్కింగ్ జర్నలిస్టులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏపీడబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కంటి అద్దాలను ఆందజేసి, మాట్లాడారు. ఇటీవల అనారోగ్యంతో ఇద్దరు జర్నలిస్టులు మరణించడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామన్నారు. జర్నలిస్టులకు అన్నివిధాల అండగా ఉంటామని, వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములవ్వాలని సూచించారు. మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తమ సంస్థ ద్వారా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించడంతో పాటు ఉచితంగా 200 మందికి కంటి అద్దాలను సమకూర్చామన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


