● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపాటు
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో ఎప్పుడైతే పలుచనవుతుందో ఆ వెంటనే జనం దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కారిడార్‌గా మార్చుకుని రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనకు విశేష స్పందన లభిస్తోందన్నారు. కేవలం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పిన మాటలకు అన్ని వర్గాలూ మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఉలిక్కిపడిన టీడీపీ నేతలు ఒకవైపు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, మరోవైపు వైఎస్సార్‌సీపీ శ్రేణులను అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. తమ పార్టీ సోషల్ మీడియా రాప్తాడు నియోజకవర్గ కన్వీనరు గిరీష్‌కుమార్‌రెడ్డి ఐటీ ఉద్యోగి అని, ఆయన ఎప్పుడూ ఎవరినీ గట్టిగా కూడా మాట్లాడలేదన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు కొందరు వెధవలు ఇచ్చిన సలహాతో గిరీష్‌రెడ్డిని టార్గెట్ చేశారని, పది రోజుల ముందే ఎస్‌బీ వారి దృష్టిలో అతని పేరు ఉందనే ప్రచారం తెరపైకి తెచ్చారన్నారు. ఈనెల 13న రాత్రి 10 గంటలకు సంబంధం లేని ఓ వ్యక్తితో కుప్పంలో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 14న సాయంత్రం అనంతపురంలో గిరీష్‌ను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనతో వాంగ్మూలం తీసుకున్నట్లు డాక్యుమెంటు సిద్ధం చేసుకుని వైఎస్ జగన్ పీఆర్‌ఓ శ్రీహరిపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. గిరీష్‌కుమార్‌రెడ్డిని రిమాండ్‌కు తరలిచేందుకు కోర్టులో హాజరుపరిస్తే జడ్జి అంగీకరించలేదన్నారు. తాను నేరం చేయలేదని, ఎలాంటి పోస్టులు పెట్టలేదని, తన ఫోన్ చెక్ చేసుకోండని గిరీష్‌కుమార్‌రెడ్డి జడ్జి ఎదుట మొరపెట్టుకున్నాడన్నారు. ఈ క్రమంలో జడ్జి ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వ కుండా ఇది తప్పుడు కేసుగా భావించి ఆయనే వ్యక్తిగత ష్యూరిటీ ఇచ్చారని, ప్రభుత్వ పాలన ఎంత చెత్తగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత విధానాలు, అక్రమ కేసులు, అరెస్ట్‌లకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జువ్వలదిన్నెలో మత్స్యకారుల వ్యతిరేకతను ఎదుర్కోలేక, జగన్ ఏర్పాటు చేసిన 10 ఫిషింగ్ హార్బర్‌లను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తుంటే తట్టుకోలేకనే గిరీష్‌రెడ్డి, శ్రీహరిని అరెస్ట్ చేశారన్నారు.
లీగల్ సెల్ సహకారంతోనే బెయిలు
గిరీష్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను రాప్తాడు వైఎస్సార్‌సీపీ సమిష్టిగా ఎదుర్కొందన్నారు. రాష్ట్ర లీగల్ సెల్ సహకారం, ఇక్కడి న్యాయవాదులు నాగన్న, బాబ్జీ సహకారంతో గిరీష్‌రెడ్డిని బెయిల్‌పై విడుదల చేయించారన్నారు. కక్షపూరిత విధానాలను పరిటాల సునీత మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో గిరీష్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, లోకనాథరెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సునీల్‌దత్తరెడ్డి, నెమలివరం రఘు పాల్గొన్నారు.


