జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ పొడిగింపు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ పొడిగింపు : కలెక్టర్‌

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

అనంతపురం అర్బన్‌: వర్కింగ్‌ జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ పొడిగిస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. అక్రిడిటేషన్‌ అమలులో ఉన్న వర్కింగ్‌ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం కింద రూ.1,250 మొత్తాన్ని చెల్లించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను రెన్యువల్‌ చేసుకోవాలన్నారు. www.cfms.ap. gov.in వెబ్‌సైట్‌ ద్వారా హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ 8342–00–120–01–03–001–001, డీడీఓ కోడ్‌ 2703 0802 003 కింద ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒరిజినల్‌ చలానా, అక్రిడిటేషన్‌ కార్డు జిరాక్స్‌, హెల్త్‌ కార్డ్‌ జిరాక్స్‌ను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు:ఎస్పీ

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జగదీష్‌ తెలిపారు. గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఉపేక్షించరాదని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్‌ఫోర్సుమెంట్‌ చర్యలను పెంచాలని, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించాలని సూచించారు. మట్కా, గంజాయి, పేకాట, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలన్నారు. పేలుడు పదార్థాలు ఇళ్లలో ఉంచు కోకుండా నిఘా మరింత పెంచాలన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌ కుమార్‌చౌదరి, ప్రొబేషనరీ ఐపీఎస్‌ అశ్విన్‌ మణిదీప్‌, డీఎస్పీలు మహబూబ్‌బాషా, శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్‌, టి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గుంతకల్లులో దొంగ బీభత్సం

గుంతకల్లు రూరల్‌: గుంతకల్లులో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు సంజీవనగర్‌లో నివాసముంటున్న డాక్టర్‌ రవి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. గురువారం వేకువజాము 2.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ఓ యువకుడు నేరుగా బెడ్‌రూంలోకి ప్రవేశించాడు. బీరువాను తెరిచి, అందులోని రెండు తులాల బంగారు నగలు తీసుకుని ఉడాయించాడు. అనంతరం అక్కడికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నివాసముంటున్న సుశీలమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. 3 గ్రాముల బంగారు మాటీలు, 4 గ్రాముల రెండు బంగారు ఉంగరాలు, 2.5 తులాల వెండి చైన్‌, రూ.15 వేల నగదు అపహరించాడు. అనంతరం పక్కనే ఉన్న పార్వతీ ఇంట్లోకి వెనుక ద్వారం నుంచి ప్రవేశించాడు. పార్వతీ కుమార్తె, మనవరాలిని గమనించి, ఆ గది తలుపులు మూసి గడియ పెట్టాడు. అనంతరం హాల్‌లో నిద్రిస్తున్న పార్వతి వద్దకెళ్లి ఆమె ముఖంపై దిండు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఉలిక్కిపడి లేచి గట్టిగా కేకలు వేసింది. దీంతో యువకుడు ప్రధాన ద్వారం తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బాధితులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో కసాపురం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement