కొనసాగుతున్న కక్ష సాధింపులు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కక్ష సాధింపులు

Apr 17 2026 10:44 AM | Updated on Apr 17 2026 10:44 AM

అనంతపురం సెంట్రల్‌: చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కక్షసాధింపుల పర్వం కొనసాగుతోంది. బైండోవర్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ అనంతపురంలోని వినాయకనగర్‌కు చెందిన షేక్‌షామిర్‌ను రిమాండ్‌కు తరలించ డం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో స్థానిక వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తీరు వివాదాస్పదంగా మారింది. షేక్‌షామిర్‌పై 2004లో రౌడీషీట్‌ ఓపెన్‌చేయగా.. అప్పటి నుంచి సత్ప్రవర్తనతో మెలుగుతూ కార్ల మెకానిక్‌ పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. షామిర్‌ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు కావడంతో ఇటీవల బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

రెచ్చగొట్టి.. కేసుల్లో ఇరికించి

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగరంలోని మూడో డివిజన్‌లో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల డివిజన్‌లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బోయ కృష్ణమూర్తితో గొడవకు దిగారు. తర్వాత తమపై దాడి చేశాడంటూ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కృష్ణమూర్తితో పాటు పలువురిపై వన్‌టౌన్‌ పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. గొడవ జరిగిన సమయంలో వీడియోలు, సీసీ ఫుటేజీలు ఇచ్చినప్పటికీ ఏకపక్షంగా కేసులు నమోదు చేసి కృష్ణమూర్తిని రిమాండ్‌కు పంపారు. గొడవను సాకుగా చూపి ఆయన వద్ద ఉంటున్నాడనే కారణంతో తాజాగా షేక్‌షామిర్‌ను రిమాండ్‌కు తరలించడం గమనార్హం.

సీఐ తీరు వివాదాస్పదం..

షేక్‌షామిర్‌ను జైలుకు పంపే విషయంలో వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బైండోవర్‌ నిబందనలు ఉల్లంఘించాడని పోలీసులు గతేడాది నవంబర్‌లోనే నోటీసులు ఇవ్వగా.. అప్పట్లోనే షామిర్‌ మండల మేజిస్ట్రేట్‌ వద్ద హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందినట్లు తెలిసింది. ఇవేవీ పట్టించుకోకుండా బుధవారం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన పోలీసులు అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో కూడా హాజరుపరచకుండానే రిమాండ్‌కు పంపినట్లు బాధితుడు వాపోయాడు.

నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు

నా కుమారుడు షేక్‌ షామిర్‌ ఏ తప్పు చేయకపోయినా వన్‌టౌన్‌ పోలీసులు వేధిస్తున్నారు. షేక్‌ షామిర్‌కు ముగ్గురు పిల్లలు సంతానం. మెకానిక్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేసుల్లో ఇరికించి జైలుకు పంపితే భార్యాపిల్లలు పస్తులుండాల్సి వస్తుంది.

– ముక్తుమ్‌వలీ, బాధితుడి తండ్రి

Advertisement
 
Advertisement
Advertisement