● కలెక్టర్ ఆనంద్
కూడేరు: వేసవి ముగిసేంత వరకు తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గురువారం ఆయన కూడేరు మండలంలోని పీఏబీఆర్ వద్ద ఉన్న సత్యసాయి, అనంత, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నిబంధనల మేరకు నీటిని శుద్ధి చేయించాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్ రావు, డీఈ కవిత, సత్యసాయి బోర్డు ఎస్‌ఈ ప్రభాకర్ రావు, తహసీల్దార్ ఉదయ్ భాస్కర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి పాల్గొన్నారు.
బకాయి వేతనాలు చెల్లించే వరకూ సమ్మెలోనే
బకాయి వేతనాలు చెల్లించే వరకూ తాము సమ్మెలోనే కొనసాగుతామని కలెక్టర్ ఓ.ఆనంద్‌కు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు స్పష్టం చేశారు. తాగునీటి పథకాల పరిశీలనకు వచ్చిన కలెక్టర్‌ను కార్మికులు కలిసి మాట్లాడారు. ‘సార్ .. కాంట్రాక్టర్లు నెలనెలా జీతంలో కోతలు విధిస్తూ మా పొట్ట కొడుతున్నారు’ అంటూ వాపోయారు. రూ.16,500 వేతనం ఇవ్వాల్సి ఉండగా రూ.15 వేలే ఇస్తున్నారని తెలిపారు. ఫేజ్–4 కింద పనిచేస్తున్న కార్మికులకు రూ.16,500కు గాను రూ.10,500 ఇస్తున్నారన్నారు. ఈ వేతనాలు కూడా గత 9 నెలలుగా చెల్లించకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 38 నెలల పీఎఫ్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో కుటుంబ పోషణ భారమై తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. స్పందించిన కలెక్టర్ జెడ్పీ అధికారులతో మాట్లాడి కొంత మేర బడ్జెట్ అందేలా చేస్తానని భరోసానిచ్చారు. మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్లతో మాట్లాడి సర్దుబాటు చేయించాలని అక్కడే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసులును ఆదేశించారు. దీంతో పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకూ తాము సమ్మెలో కొనసాగుతామని కార్మికులు తెగేసి చెప్పారు.


