నిర్లక్ష్యంతోనే పేలుళ్లు! | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతోనే పేలుళ్లు!

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

భారీ పేలుడుతో భీతావహ వాతావరణం

కుమ్మరవాండ్లపల్లి ఘటనపై సర్వత్రా విస్మయం

కదిరి అర్బన్‌/కదిరి టౌన్‌: బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతం.. కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. శరీరాలన్నీ కాలిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. స్థానికుల హాహాకారాలు మిన్నంటాయి. భారీ పేలుడు శబ్దం చుట్టుపక్కల చాలా దూరం వరకు విన్పించింది. ఏమి జరిగిందో అర్థం కాక పట్టణవాసులు రకరకాలుగా చర్చించుకున్నారు. చివరకు జిలెటిన్‌స్టిక్స్‌ పేలుడు వల్ల దుర్ఘటన జరిగిందని తెలిసి ప్రజలు నిర్ఘాంతపోయారు. కదిరి చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఘటన ఇప్పుడు సంభవించిందంటూ విస్మయం వ్యక్తం చేశారు.

పదేళ్లుగా.. యథేచ్ఛగా..

కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్‌స్టిక్స్‌ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్‌ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. ఒకసారి పనులకు వెళితే తర్వాత రెండు, మూడు రోజులకు గానీ తిరిగొచ్చేవారు కాదు. దీంతో కష్టపడి పనులు చేసుకుంటున్నారని స్థానికులు అనుకునేవారు. ఓ భారీ ప్రమాదపుటంచున తాము జీవిస్తున్నామని వారు ఏ రోజూ భావించలేదు.

కరువైన తనిఖీలు

ఎక్కడైనా భారీ బ్లాస్టింగ్‌లు జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, మైనింగ్‌ తదితర శాఖల అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకే పేలుళ్లు జరుపుతున్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఉల్లంఘించినట్లు తేలితే కేసు నమోదు చేసి, కఠిన చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. చాలాకాలం నుంచి కదిరి చుట్టుపక్కల యథేచ్ఛగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతకాలం క్రితం గట్లు వద్ద ఓపెన్‌ బ్లాస్టింగ్‌ చేస్తుండగా.. సమీప కాలనీవాసులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని రెండు రోజులు స్టేషన్‌లో ఉంచుకుని వదిలేశారు. కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. దీంతో షరామామూలే అన్నట్లు బ్లాస్టింగ్‌లు జరిగిపోతున్నాయి. పేలుడు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల మధ్య నిల్వ చేసేందుకు వీలులేదు. ఊరికి దూరంగా, అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య మాత్రమే నిల్వ చేయాలి. బ్లాస్టింగ్‌ చేసే వారికి కూడా ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్స్‌ ఉండాలి. కానీ ఇలాంటి భద్రతా ప్రమాణాలేవీ పాటించపోయినా అధికారులు పట్టించుకోకపోవడం కుమ్మరవాండ్లపల్లిలో భారీ విషాదానికి దారి తీసిందని ప్రజలు మండిపడుతున్నారు.

సాక్షి, పుట్టపర్తి : ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ చాలా మంది పేలుడు పదార్థాలను ఇంట్లోనే నిల్వ ఉంచుకుని ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో మూడేళ్లలో మూడు పేలుళ్లు సంభవించాయి. కొత్తచెరువు మండలం వంగంపల్లిలో జరిగిన గ్యాస్‌ పేలుడులో ఓ మహిళ దుర్మరణం చెందగా.. గోరంట్లపల్లిలో ప్రజలు ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ రెండు ఘటనలు 2023 జూలై, ఆగస్టు నెలల్లో జరిగాయి. ఆ తర్వాత పేలుడు ఘటనలు లేవనే చెప్పవచ్చు. అయితే తాజాగా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. నలుగురు దుర్మరణం చెందగా.. 28 మంది గాయపడ్డారు. అవగాహన లోపంతో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంతోనే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ముందుగా అప్రమత్తమై పరారీ

తెలంగాణ నుంచి వచ్చిన ఓ కుటుంబం పదేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో నివాసం ఉంటోంది. రాతి పనులకు వెళ్లే క్రమంలో పేలుడు పదార్థాలు వినియోగించేవారు. పనుల్లో భాగంగా ఒకేసారి భారీ డంపు చేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం సమయంలో పేలుడు పదార్థాల నుంచి పొగ వస్తుండటం గమనించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు.

గ్యాస్‌తో ప్రమాదమే

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల సరఫరా సరిగా జరగడం లేదు. దీంతో చాలా మంది అవసరం లేకపోయినా గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. జాగ్రత్తలు పాటించకుండా సిలిండర్లను ఎక్కడపడితే అక్కడ ఉంచితే పెనుప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే చర్యలే

పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకోవడం నేరం. ఎవరి ఇంట్లో అయినా అనుమతులు లేని పేలుడు పదార్థాలు ఉన్నట్లయితే వెంటనే బయట పడేయండి. పోలీసులకు పట్టుబడితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే విషయం గ్రహించాలి. గ్యాస్‌సిలిండర్ల నిల్వలోనూ జాగ్రత్త అవసరం. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్‌.సతీష్‌ కుమార్‌, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement