శ్రీహరి అరెస్ట్‌ అక్రమం | - | Sakshi
Sakshi News home page

శ్రీహరి అరెస్ట్‌ అక్రమం

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

అనంతపురం : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా సెల్‌ ఇన్‌చార్జ్‌) పూడి శ్రీహరి అరెస్ట్‌ అక్రమం అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం మాటున సాగుతున్న అరాచకాలకు ఇలాంటి ఉదంతాలు పరాకాష్టగా నిలుస్తున్నాయన్నారు. బుధవారం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు సాకే శైలజానాథ్‌, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి అనంత వెంకటరామిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ సివిల్‌ డ్రస్‌లో వచ్చి నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని అరెస్టు చేసి, తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలు గురించి ప్రశ్నించినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారన్నారు. ఏకంగా అంబేడ్కర్‌ జయంతి రోజున రెడ్‌బుక్‌ రాజ్యాంగం గురించి మంత్రి నారా లోకేష్‌ మాట్లాడడం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ పోలీసులు 41 నోటీసు ఇవ్వకుండా, ఎలాంటి విచారణా చేయకుండా శ్రీహరిని దారిలో అడ్డుకుని అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. తక్షణమే శ్రీహరిని బేషరతుగా విడుదల చేయాలని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విధానానికి విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు.

దౌర్జన్యానికి పరాకాష్ట

పోలీసులు సివిల్‌ డ్రస్‌లో వచ్చి పూడి శ్రీహరికి చెందిన ల్యాప్‌టాప్‌, ఫోనును లాక్కెళ్లడం దౌర్జన్యానికి పరాకాష్ట అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గతంలో సజ్జల భార్గవరెడ్డి అంశంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. సమ సమాజ స్థాపనకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని, అలాంటి మహనీయుడి జయంతి రోజునే నారా లోకేష్‌ ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’పై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 111 సెక్షన్లు పెట్టడం.. వాటిపై బెయిల్‌ రాకుండా చేయడం.. ఇలాంటి అంశాలను సమాజం హర్షించదని అన్నారు. ఇప్పటికై నా అక్రమ నిర్బంధాలు మానుకోవాలని హితవు పలికారు. రెడ్‌బుక్‌ పేరిట సాగిస్తున్న దాష్టీకాలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి తప్ప కక్షసాధింపు చర్యలకు పోరాదని సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరైనవి కాదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.

రాజ్యాంగ హక్కులను కాలరాయడమే

రెడ్‌బుక్‌ మాటున అరాచక పాలన తగదు

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement