● కలుషిత నీరు తాగి రోగాల బారిన జనం
ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గ కేంద్రం ఉరవకొండలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పలు కాలనీలకు పబ్లిక్ కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు పూర్తిగా రంగుమారి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. కుళాయిల ద్వారా వస్తున్న నీటిని బకెట్‌లో పట్టుకుంటే పూర్తిగా నురుగు తేలి డ్రెయినేజీ నీరులా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలుషిత నీటి కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోగాల బారిన పడ్డారని తెలిపారు. పట్టణంలోని ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారు రోజూ కలుషిత నీటిని బాటిళ్లలో పట్టుకెళ్లి అధికారుల ఎదుట ఏకరువు పెడుతున్నా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. తాజాగా 11, 12 వార్డులు, పార్కు ఆంజనేయస్వామి ఆలయం, అరబిక్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో బుధవారం కూడా కలుషిత నీరు సరఫరా కావడంతో అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి ప్రజల తాగునీటి కష్టాలు దూరం చేయాలని పలువురు కోరుతున్నారు.
గిరిష్‌కుమార్‌రెడ్డికి
బెయిల్ మంజూరు
ఆత్మకూరు: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగంతో ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్‌కుమార్‌రెడ్డిని కుప్పం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెంటనే లాయర్ల ద్వారా హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయించారు. దీంతో సొంత పూచీకత్తిపై గిరీష్‌కుమార్‌రెడ్డికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్లిష్ట సమయంలో కార్యకర్తల పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
బంగారు ఆభరణాల అపహరణ
కణేకల్లు: ప్రయాణికురాలి వద్ద నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన కణేకల్లులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా కణేకల్లులో తన బంధువుల ఇంట జరుగుతున్న నామకరణ వేడుకలకు అత్త హమీదాతో కలిసి సోమవారం సాయంకాలం ఆర్టీసీ బస్సు కణేకల్లు క్రాస్ వరకూ ప్రయాణించింది. అక్కడి నుంచి ఆటోలో కణేకల్లుకు చేరుకున్నారు. ఇక్కడి బస్టాండ్ నుంచి మరో ఆటో ఎక్కి బంధువుల ఇంటికి చేరుకుని, బ్యాగ్ పరిశీలించగా అందులో మూడు తులాల బంగారు ఆభరణాలు ఉంచిన బాక్స్ కనిపించలేదు. ఘటనపై అత్త హమీదా ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగమధు తెలిపారు.
టీడీపీ పొలిట్‌బ్యూరోలో
ఇద్దరికి స్థానం
అనంతపురం టౌన్: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరికి స్థానం కల్పిస్తూ ఆ పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు మరోమారు అవకాశం కల్పించారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. దీంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతనిధులుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, గుణపాటి దీపక్‌రెడ్డి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా బీవీ వెంకటరాముడును నియమించారు. వీరితోపాటు జిల్లా నుంచి పలువురికి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి స్థానం దక్కింది.
మద్యం దుకాణం సీజ్
శింగనమల: మండల కేంద్రంలోని మద్యం దుకాణాన్ని ఎకై ్సజ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. బుక్కరాయసముద్రం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శింగనమలలోని దుకాణంలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
కీచక అధికారిపై విచారణ
తాడిపత్రి టౌన్: మహిళా ఉద్యోగులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ అధికారి తీరుపై ‘మున్సిపాలిటీలో కీచకుడు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో బుధవారం ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి విచారణ చేపట్టారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని మహిళా సిబ్బందిని విడివిడిగా విచారణ చేశారు.


