ఉరవకొండ: సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం మానుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రమణ హితవు పలికారు. ఇటీవల పబ్లిక్ మీటింగ్‌లలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై మంత్రి మాట్లాడిన తీరు చూస్తుంటే కనీస విషయ పరిజ్ఞానం కూడా ఆయనకు లేదనే విషయం తేటతెల్లమవుతోందన్నారు. బుధవారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముచ్చుమర్రి ఎత్తిపోతుల పథకానికి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధమే లేదనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకంలో భాగంగా 834 అడుగుల ఎత్తుతో పంపింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన కారణంగా నీరు అందని సమయంలో ప్రత్యామ్నాయంగా 800 అడుగుల నుంచి పంపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ రోజులు వరద ఉంటే నేరుగా కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు ఇవ్వడమే ముచ్చమర్రి ఎత్తిపోతల పథకం ఉద్దేశమన్నారు. అయితే మంత్రి కేశవ్ మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని, ఒకసారి డీపీఆర్ కోసం, రెండో సారి మంచినీటి కోసమేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయితే మిగులు జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను సాగునీటి కోసమే అని చెబితే అనుమతులు వస్తాయా? అని ప్రశ్నించారు. మంచినీళ్ల కోసమంటూ ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను కూడా నిర్మించిన విషయం కూడా మంత్రి కేశవ్‌కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. రాయలసీమ ప్రాంత సాగునీటి సాధన ఉద్యమకారులు, మేధావులు, ప్రజలందరూ శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చాలని గగ్గోలు పెడుతుంటే మంత్రి కేశవ్ మాత్రం రాయలసీమకు తీరని అన్యాయం జరిగేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాల కోసం మంత్రి ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేసినట్లు మంత్రి కేశవ్ చెబుతున్నారని, ఈ అంశంపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. 1985లో హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారని, ఆ తర్వాత 2005లో జలయజ్ఞంలో భాగంగా పనులను డాక్టర్ వైఎస్సార్ పూర్తి చేయించారని గుర్తు చేశారు. 1994లో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఒక్క కిలోమీటరు కూడా కాలువ తవ్వలేదనే విషయం తెలుసుకోవాలన్నారు. 2014 నుంచి 2019 వరకు రెండో దశ పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే నేడు కుప్పం ప్రాంతానికి సీఎం చంద్రబాబు దర్జాగా నీటిని మళ్లించుకుంటున్నారని తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఏడేళ్ల పాలనలో హంద్రీ–నీవా కోసమే రూ.7వేల కోట్లు ఖర్చు పెట్టి 70 శాతం మొదటి దశ పనులు పూర్తి చేశారన్నారు.చంద్రబాబు అవగాహనా లోపం కారణంగా 40 టీఎంసీల సామర్థ్యం కలిగిన హంద్రీ–నీవా ప్రాజెక్ట్ కాస్త 5 టీఎంసీల మంచినీళ్ల ప్రాజెక్టుగా మారుతోందని మండిపడ్డారు. 11,500 క్యూసెక్కులకు బదులు, 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి నీటిని కుదించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా కేశవ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, లేకపోతే రాయలసీమ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు.
‘హంద్రీ–నీవా’కు చంద్రబాబు చేసిన మేలు ఏదీ లేదు
దమ్ముంటే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌పై బహిరంగ చర్చకు రావాలి
రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రమణ


