అనంతపురం క్రైం: తాడిపత్రి మున్సిపాలిటీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉన్నతాధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం అనంతపురంలోని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడారు. ఉన్నత హోదాలో ఉంటూ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. బాధితులు అధిక సంఖ్యలో ఉన్నా... ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా వారు ధైర్యంగా బయటకు చెప్పుకోలేక మానసికంగా కుదేలవుతున్నారన్నారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బాధితులకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లైంగిక వేధింపుల వంటి ఘటనలను పంచాయితీల పేరుతో కప్పిపుచ్చడం న్యాయాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీచకుడి వెనుక ఉన్న రాజకీయ ఆశ్రయం బయటపడకపోతే నిజాలు వెలుగులోకి రావని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధిత మహిళలకు పూర్తి రక్షణ కల్పించి, వారి ఫిర్యాదులను గోప్యంగా స్వీకరించాలని సూచించారు. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) నాగరాజుకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. నాగమణి, గోపాల్, నాగరాజు, ముత్తు, తిరుమలేష్, ఎర్రిస్వామి, లక్ష్మీనరసమ్మ, నాగేంద్ర, శ్రీనివాసులు, ఆజాం బాషా, గురుస్వామి, నల్లప్ప, పరమేష్, గిరి, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.


