ఉరవకొండ: రాష్ట్రంలో పేదల సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్న క్యాంటీన్లు, హంద్రీ–నీవా తదితర అంశాలపై ఇటీవల మంత్రి కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఖండించారు. అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందన్నారు. రూ.14,800తో చదరపు అడుగు నిర్మాణం చూపడం దారుణమన్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగు రూ.4 వేలతో అద్భుత కట్టడాలు వెలుస్తున్నాయన్నారు. కేవలం అమరావతి ప్లాన్ కోసమే రూ400 కోట్లు తగలేశారని, రాజధాని ప్రాంతంలో వర్షపు నీళ్లు ఎత్తేయడానికి, ముళ్ల కంపలు తొలగించడానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. మొబైలజేషన్ అడ్వాన్స్ పేరుతో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ5,500 కోట్లు దోచి పెట్టారన్నారు. రాజధానిలో మౌలిక వసతులకే రూ. 2లక్షల కోట్లు కావాలని, ఈ అప్పు ఎవరు తీరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాజధాని తప్ప పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వం దోచుకో..దాచుకో అనే రీతిలో పాలన సాగిస్తోందని మండిపడ్డారు. హంద్రీ–నీవా ద్వారా చంద్రబాబు తన నియోజకవర్గానికి నీటిని తీసుకెళుతున్నారని, అయితే ఇప్పటి వరకూ జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇచ్చే ఆలోచన ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జీడిపల్లి రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి నిల్వకు అదనంగా మరో 4 టీఎంసీలు పెంచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.675 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారని, ప్రస్తుత కేటాయింపుల్లో ఆ రిపోర్టును ఆమోదిస్తే రాయలసీమకు తాగు, సాగునీరు అవసరాలతో పాటు చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.


