గుత్తి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుత్తి కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా ఊపందుకుంది. మండలంలో టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ చౌక దుకాణాల నుంచి పేదలు తీసుకున్న బియ్యాన్ని తమ ఏజెంట్ల ద్వారా కిలో రూ.15 నుంచి రూ.17 చొప్పున కొనుగోలు చేసి ఓ చోట డంప్ చేస్తారు. ఓ బస్తాకు 50 కిలోల చొప్పున బియ్యాన్ని నింపి 500 బస్తాలు అయ్యాక మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద డంప్ చేసిన 550 బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం రాత్రి స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులోనూ కేవలం 88 బస్తాల బియ్యం మాత్రమే సీజ్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు
రేషన్ బియ్యం అక్రమ దందాలో ప్రతి నెలా పోలీసులు, రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో మామూళ్ల మత్తుకు అలవాటు పడిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు అండగా నిలవడంతో రేషన్ బియ్యం దందా ఊపందుకుంది. విషయం గుట్టుచప్పడు కానంత వరకూ అంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి బయటపడితే మాత్రం అధికారులు మాయ చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకు నిదర్శనమే ఎంగిలిబండ వద్ద సోమవారం రాత్రి అధికారులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం డంప్. అక్కడి నిర్జన ప్రదేశంలో 550 బస్తాల రేషన్ బియ్యాన్ని డంప్ చేసినట్లుగా స్థానికులు గుర్తించి పక్కా సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో ఓ ఎస్‌ఐ అక్కడకు వెళ్లి రేషన్ బియ్యం కనిపించలేదని వెనుదిరిగారు. కాసేపటి తర్వాత మరో ఎస్‌ఐ, సిబ్బంది అక్కడకు చేరుకుని 88 బస్తాలు మాత్రమే ఉన్నాయంటూ సీజ్ చేయించారు. అయితే 550 బస్తాలు ఉన్నట్లు సమాచారం ఇస్తే కేవలం 88 బస్తాలు మాత్రమే సీజ్ చేయడం వెనుక స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 462 బస్తాల రేషన్ బియ్యం ఏమయ్యాయో అంతు చిక్కడం లేదు. నెల రోజుల క్రితం కూడా ఎంగిలిబండ సమీపంలో 150 బస్తాల రేషన్ బియ్యం డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న చాలాసేపటి తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని 60 బస్తాలు మాత్రమే పట్టుబడినట్లు వెల్లడించారు. ఈ అంశంలో తలెత్తిన అనుమానాలు వీడక ముందే తాజాగా 462 బస్తాల రేషన్ బియ్యం లెక్క తేలకపోవడంతో ఈ అక్రమ దందా వెనుక రెవెన్యూ, పోలీసుల సహకారం ఉందనే అనుమానాలు బలపడ్డాయి.
పేదల ఆకలి తీర్చేందుకు చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి పోతోంది. గుత్తి కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ దందా వెలుగు చూడడంతో స్థానికులు అవాక్కవుతున్నారు. అయితే అక్రమార్కులకు అధికారులు అండగా నిలవడంతోనే రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
అక్రమంగా డంప్ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
అక్రమార్కులకు అధికారుల అండ
550 బస్తాల డంప్ నుంచి కేవలం 88 బస్తాలు సీజ్
462 బస్తాల రేషన్ బియ్యం మాయంపై అనుమానాలు


