గుంతకల్లు టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి కుమార్తె, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి కలిశారు.
కూలీల సంఖ్య పెంచాలి : డ్వామా పీడీ
శింగనమల: ఇప్పటి వరకూ పూర్తి చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లులు త్వరగానే అందిస్తామని డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. మంగళవారం శింగనమలలో చేపట్టిన ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. మస్టర్లను పరిశీలించి, హాజరును తనిఖీ చేశారు. కూలీల సంఖ్య మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు. ఎండలు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పనులకు త్వరగా ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని కూలీలకు సూచించారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ.. పని ప్రాంతంలో నీడ కోసం టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ భాగ్యలక్ష్మి, టీఏ అనిల్, సిబ్బంది పాల్గొన్నారు.
బైకు అదుపు తప్పి
యువకుడి మృతి
ఉరవకొండ రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామానికి చెందిన అశోక్ (36) సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఉరవకొండకు బయలుదేరాడు. పట్టణ సమీపంలోని శ్మశాన వాటిక వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఐచర్‌ను ఢీకొన్న బొలెరో – ఒకరి మృతి
విడపనకల్లు: ఐచర్‌ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి వద్ద ఐచర్ వాహనం మరమ్మతులకు లోను కావడంతో 42వ జాతీయ రహదారి పక్కన డ్రైవర్ ఆపేశాడు. ఈ క్రమంలో మంగళవారం బళ్లారి వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐచర్‌ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన బొలెరో వాహన డ్రైవర్‌ను స్థానికులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని తమిళనాడుకు చెందిన సుందరమూర్తిగా (47) గా పోలీసులు గుర్తించారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆర్టీసీ ప్రయాణికుడికి
జరిమానా
కదిరి అర్బన్: ఆర్టీసీ బస్సులో కోళ్లను బెంగళూరుకు తరలిస్తున్న ఓ ప్రయాణికుడికి మంగళవారం ఆ సంస్థ విజిలెన్స్ అధికారులు జరిమానా విధించారు. ఉమ్మడి జిల్లాలఆర్టీసీ విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, సిబ్బంది ప్రవీణ్‌కుమార్... మంగళవారం గౌనిపల్లి వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కదిరి డిపోకు చెందిన బస్సు డిక్కీలో 46 కోళ్లను బెంగళూరుకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. సజీవ మూగజీవాలు, పక్షులను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లకూడదని వారు తెలిపారు. లగేజీపై జరిమానా, మూగజీవాలను అక్రమంగా తరలించడం రెండూ కలిపి రూ. 1,750 జరిమానా విధించి వివరణ తీసుకుని పంపిచేశారు.


