అంబేడ్కర్‌ స్ఫూర్తితో సమగ్రాభివృద్ధికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ స్ఫూర్తితో సమగ్రాభివృద్ధికి చర్యలు

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: నవ భారత నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని డీపీఆర్సీ సమావేశ హాలులో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ఓ. ఆనంద్‌, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు పి. వెంకటప్ప, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు రామాంజమ్మ, జిల్లా/డివిజన్‌ ఎస్సీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ సభ్యుడు, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అంకె ఈశ్వరయ్య, దూదేకుల సంఘం సభ్యుడు ఇమామ్‌ హుస్సేన్‌, విశ్వకర్మ బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుర్లపల్లి రంగాచారి, రజక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పరమేశ్వర్‌ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. అంబేడ్కర్‌ భవనం, బీసీ స్టడీ సర్కిల్‌, ఎస్సీ/ఎస్టీ సబ్‌–ప్లాన్‌, హాస్టల్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. నంబర్‌–3 హాస్టల్‌ మూసివేత అంశాన్ని పరిశీలించి, అవసరమైతే వచ్చే ఏడాది నుంచి అద్దె భవనంలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయ, ఏడాదికి 4 బాల్య వివాహాలు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు.

ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్‌ అధికారి శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ శైలజ, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్‌, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, డ్వామా పీడీ సలీంబాషా, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ ఓ.ఆనంద్‌

Advertisement
 
Advertisement
Advertisement