అనంతపురం సెంట్రల్: అనంతలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య గొంతు కోసిన భర్త ఉదంతం మంగళవారం శ్రీనివాసనగర్ సైఫుల్లా బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నగరంలోని రాజీవ్‌కాలనీలో నివాసముంటున్న రాజేష్, తేజస్విణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లారీ డ్రైవర్‌గా రాజేష్ పనిచేస్తుండగా.. సైఫుల్లాబ్రిడ్జి సమీపంలో ఓ బిర్యాని సెంటర్‌లో తేజస్విణి పనికి వెళుతోంది. కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తరుచూ గొడవలు జరిగేవి. దీంతో వారం రోజులుగా తేజస్విణి నగరంలోని ఓ పీజీలో ఉంటూ పనికి వెళుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సదరు బిర్యానీ సెంటర్ వద్ద పనిలో ఉండగా రాజేష్ వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. మాటమాట పెరిగి అక్కడే ఉన్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అదే సెంటర్‌లో పనిచేస్తున్న యువకుడు లక్ష్మీనారాయణ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిపై కూడా దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయమైంది. స్థానికులు స్పందించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తేజస్విణి పరిస్థితి మెరుగు పడుతోందని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేష్‌ను అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. ఘటనపై పూర్తిగా విచారిస్తున్నట్లు వివరించారు.
అనంతలో ఘాతుకం
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం


