బొమ్మనహాళ్: మండల కేంద్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం శ్రీవారు శేష వాహనంపై విహరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ, మంగళ హారతి, తీర్ధప్రసాదాలు, అన్నసంతర్పణ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన శేషవాహనంపై శ్రీవారిని కొలువుదీర్చి పుర వీధుల్లో ఊరేగింపు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
నేడు ఇంటర్ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనుంది. జిల్లాలో వేలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఈ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ BIEAP Results Portal ద్వారా హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 95523 00009 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపితే ఫలితాలు అందుతాయి. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్‌పై భారీ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఓపికగా ప్రయత్నించాలని అధికారులు సూచించారు.
పెద్దమ్మా.. కరుణించమ్మా..!
అనంతపురం కల్చరల్: నగరంలోని ఐదోరోడ్డులోని పెద్దమ్మ జాతర మంగళ వారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నిర్వాహకులు రంగా, సాయి, ఆంజనేయులు, నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా
యాక్టివిస్ట్ అరెస్ట్
ఆత్మకూరు: పంపనూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్‌కుమార్‌రెడ్డిని కుప్పం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఫిర్యాదు చేశారు.. ఏ విషయం అనేది కుటుంబ సభ్యులకు సమాచారం తెలపకుండా గిరీష్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోంది.
వైభవంగా దేవమ్మదేవి జాతర
బొమ్మనహాళ్: సిద్దరాంపురంలో మంగళవారం దేవమ్మ దేవి దేవర ఘనంగా ప్రారంభించారు. భక్తులు మేళాతాళాలతో ఇళ్ల నుంచి బోనాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా వచ్చిన జనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్‌రెడ్డి అమ్మవారికి దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జంతు బలిదానం చేయనున్నట్లు కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, నాయకులు జయరామ్‌రెడ్డి, కోటేశ్వరరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశులు, సురేష్, డాక్టర్ బసప్ప, ఫొటో బసవరాజు, నాగరాజు, హరి, ప్రసాద్ రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, ముక్కన్న, రామ్‌చరణ్ పాల్గొన్నారు.


