బొమ్మనహాళ్: పంచాయతీ కార్యదర్శులు ఫొటోలకు పోజివ్వకుండా చెత్త సేకరణపై దృష్టి పెడితే గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు సూచించారు. జిల్లాలోని 30 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రామ స్ధాయిలో పారిశుధ్యం మెరుగు పరచడం, ప్రజల్లో శుభ్రతపై సానుకూల భావన పెంపొందించడమే లక్ష్యంగా రెండో రోజు శిక్షణను మంగళవారం ఉంతకల్లులోని చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ ఫొటోలకు పోజులు ఇవ్వడంపై కాకుండా గ్రామాల్లో చెత్త సేకరణపై కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారానికి మూడు రోజులపాటు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే శుభ్రత సాధ్యమవుతుందని చెప్పారు. విడతల వారీగా ఈ నెల 18వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటి ఎంపీడీఓ వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి పల్లవి తదితరులు పాల్గొన్నారు.


