సూరీడు సలసల | - | Sakshi
Sakshi News home page

సూరీడు సలసల

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

జిల్లా అంతటా 40 నుంచి 43 డిగ్రీలతో భానుడి భగభగలు

అనంతపురం అగ్రికల్చర్‌: మండే ఎండలకు ఉమ్మడి ‘అనంత’ అట్టుడుకుతోంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో జనజీవనం స్తంభించే స్థాయికి చేరుకుంటోంది. వేసవితాపం అధికం కావడంతో ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు, జంతుజాలం విలవిలలాడుతోంది. సోమవారం తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా అంతటా 40 నుంచి 43 డిగ్రీలతో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శింగనమల 41.8, నార్పల 41.6, పుట్లూరు 41.4, యల్లనూరు 41.4, విడపనకల్లు 41.3, ఆత్మకూరు 41.1, కళ్యాణదుర్గం 41.1, పెద్ద పప్పూరు 41 డిగ్రీలు...ఇలా తూర్పు, ఉత్తర ప్రాంత మండలాల్లో ఎండ తీవ్రత తారస్థాయికి చేరుకుంది. అనంతపురం, గుంతకల్లు, వజ్రకరూరు, బుక్కరాయ సముద్రం, బొమ్మనహాళ్‌, గుత్తి, కంబదూరు మండలాల్లో కూడా వేసవితాపం అధికంగా ఉంది.

● శ్రీసత్యసాయి జిల్లాలో కూడా రామగిరి 41.1 డిగ్రీలు, ధర్మవరం 40.6, పుట్టపర్తి 40.5, ఎన్‌పీ కుంట 40.4, ముదిగుబ్బ 40.2, నల్లమాడ 40.2 డిగ్రీల మేర ఎండ తీవ్రత కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదవుతూ సెగలు పుట్టిస్తున్నాయి. వడగాల్పులు కూడా 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సూరీడు సలసలమంటున్న పరిస్థితి నెలకొంది. ఏసీలు మినహా ఫ్యాన్లు, కూలర్లు పెద్దగా పనిచేసే పరిస్థితి లేక రాత్రింబవళ్లు జనం ఉడికిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇటీవల వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

రానున్న రోజులు మరింత భయానకమే

ఇప్పుడే ఇలా ఉంటే ఈ నెల 16 నుంచి మొదలయ్యే వైశాఖ మాసం, వచ్చే నెలలో రోహిణి కార్తెలను తలచుకుని జనం మరింత భయపడిపోతున్నారు. ‘ఎల్‌–నినో’ కారణంగా ఈసారి వేసవితాపం పతాకస్థాయికి చేరుకునే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఐస్‌ లేకుండా మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, బత్తాయి లాంటి పండ్లరసాలు, చెరకు రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గొడుగు, టోపీ, మాస్క్‌ లాంటివి లేకుండా బయటకు రాకూడదని చెబుతున్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అనంతపురంలో ఎండకు తట్టుకోలేక స్కార్ఫ్‌లతో ఇలా..

అనంతపురంలో ఎండ సెగకు ఏడుస్తున్న చిన్నారి

Advertisement
 
Advertisement
Advertisement