అనంతపురం: భవిష్యత్తులో కృష్ణా, తుంగభద్ర జలాలు తగ్గే అవకాశముందని కరువు పీడిత ‘అనంత’ను, అదే విధంగా రాయలసీమలోని తక్కిన జిల్లాలను పరిరక్షించేందు కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతను ప్రదర్శించారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటాన్ని జీర్ణించుకోలేక మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఓ క్రిమినల్ అని విమర్శించారు. గతంలో ఉరవకొండ ప్రాంతంలో అరాచకాలు రాజ్యమేలాయని, సూడో నక్సల్స్ పేరుతో హత్యాకాండ కొనసాగించారని, ఆఖరుకు పోలీస్‌స్టేషన్ పక్కనే హత్యలు జరిగిన ఘటనలూ ఉన్నాయని గుర్తు చేశారు. కేశవ్ తరహాలోనే అందరికీ నేర మనస్తత్వం ఉంటుందని భావించి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయన కమీషన్ల కక్కుర్తి తారస్థాయికి చేరిందని, ఆయన కమీషన్ల మంత్రి అంటూ టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏడాదిలో హంద్రీ–నీవా లైనింగ్‌కు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామని కేశవ్ గొప్పలు చెప్పుకుంటుండటం సిగ్గుచేటన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లేదన్నారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచారా అని నిలదీశారు. లైనింగ్ పేరుతో హంద్రీ–నీవా నీటిని కుప్పంకు తరలించి ‘అనంత’ రైతుల కడుపు కొట్టారన్నారు. తమ హయాంలో హంద్రీ–నీవా కాలువ నీరు భూముల్లోకి ఇంకడం వల్ల వేలాది మంది రైతుల వ్యవసాయ బోర్లు రీచార్జ్ అయ్యాయని గుర్తు చేశారు. తాజాగా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల నీరు ఆగకుండా వెళ్లిపోతుండటంతో ఎక్కడా సమీప భూముల్లోకి ఇంకే అవకాశం లేకుండా చేసి రైతులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు.
పోతిరెడ్డిపాడు విస్తరణకు అడుగడుగునా అడ్డు
హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే.. టీడీపీ నేతలు తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారని విమర్శించారు. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, సీఎం చంద్రబాబుకు, మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డి చెప్పింది అబద్ధమని చెప్పగలరా అని సవాల్ చేశారు.
రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. ఏదైనా ప్రాంతం నష్టపోతుందని భావించినపుడు అధికార, ప్రతిపక్ష పార్టీలతో కలిసి పరిరక్షణకు కృషి చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏదైనా ఒక్కటైనా చేశారా అని నిలదీశారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా రాయలసీమ ఎత్తిపోతల పథకం, అక్రమ కేసులు, మహిళలపై అత్యాచారాలపై ప్రశ్నించి తీరతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, దేవా, ఎస్టీ సెల్ నగర కార్యదర్శి గుజ్జల శివయ్య తదితరులు పాల్గొన్నారు.
‘మావిగన్’ను జీర్ణించుకోలేకే మంత్రుల అవాకులు
తారస్థాయికి చేరిన క్రిమినల్ కేశవ్ కమీషన్ల కక్కుర్తి
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
చంద్రబాబు నిర్వాకంతో సీమ ఎడారిగా మారుతోంది
మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య


