వజ్రకరూరు: సత్యసాయి నీటి పథకానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి, నిధులు విడుదల చేయాలని, నాలుగు నెలల వేతన బకాయిలు మంజూరు చేయాలంటూ ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం వజ్రకరూరు తహసీల్దార్ నరేష్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గౌస్, ఎస్‌ఐ నాగస్వామినిను కలసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. నీటి సరఫరా పథకం నిర్వహణకు ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, గత ఏడాదికి సంబంధించి అరకొర నిధులు కేటాయించి పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు దుర్భర జీవనం గడుపుతున్నారని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లడం అనివార్యమైందని పేర్కొన్నారు. డిమాండ్లు నెరవేరేవరకూ నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీసత్యసాయి తాగునీటి పథకం కా ర్మికులు బాబయ్య, జయన్న, చెన్నయ్య, భీమేష్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్‌లో వర్షాలు తక్కువే
అనంతపురం అగ్రికల్చర్: వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ కాలంలో వర్షాలు తక్కువగానే నమోదవుతాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించిందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లా–నినో బలహీనపడిందని, జూన్ నుంచి ఎల్–నినో ప్రభావం ఉంటుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవచ్చన్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదారు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని, మిగతా మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖరీఫ్ వ్యవసాయం కీలకం కావడంతో భారత వాతావరణ శాఖ చేదునిజం చెప్పడంపై అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలకు సంబంధించి ఈ నెలాఖరున స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
‘స్పాట్’ రెమ్యూనరేషన్ పెంచాలి
● వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్న స్పెషల్ అసిస్టెంట్లకు అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ)తో సమానంగా డీఏ, రెమ్యూనరేషన్ ఇవ్వాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గతంతో పోలిస్తే వారి పనిభారం గణనీయంగా పెంచినా తగిన పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వారి శ్రమకు తగిన గౌరవం కల్పించేలా వెంటనే డీఏ, రెమ్యూనరేషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెన్నహోబిలం హుండీ కానుకల లెక్కింపు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 110 రోజులకు గాను శాశ్వత హుండీల ద్వారా రూ.28.66 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, సభ్యులు బొల్లినేని పద్మాక్షి, గుంతకల్లు హనుమాన్ సేవాసంస్థ సభ్యులు, అనంతపురం ఒకటో రోడ్డు శివాలయం సేవా సమితి, భవాని సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


