వెంటాడుతున్న భూ సమస్యలు | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న భూ సమస్యలు

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణ

‘పరిష్కార వేదిక’లో 587 అర్జీలు

అందులో అత్యధికం భూ సమస్యలే

అనంతపురం అర్బన్‌: రైతులను భూ సమస్యలు వెంటాడుతున్నాయి. వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు భూసమస్యలపై అర్జీలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. కలెక్టర్‌ ఆనంద్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, రామ్మోహన్‌, అఖిల ప్రజల నుంచి వివిధ సమస్యలపై 587 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు 350 వరకు ఉండడం గమనార్హం. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.

వినతుల్లో కొన్ని..

● వితంతు పింఛను మంజూరు చేయాలని గుమ్మఘట్ట మండలం యర్రంపల్లికి చెందిన కాపు లక్ష్మి విన్నవించింది. తన భర్త 2018లో అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. జీవనం కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకుంది.

● సాధారణ రైతునైన తనను ట్యాక్స్‌ పేయర్‌గా నమోదు చేశారని పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పి.వేణుసాగర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో తనకు అన్నదాత సుఖీభవ, తన కుమారులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదని వాపోయాడు. ట్యాక్స్‌ పేయర్‌ జాబితా నుంచి తొలగించి తమకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement