పెళ్లింట గొడవ – వ్యక్తిపై దాడి | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట గొడవ – వ్యక్తిపై దాడి

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

యల్లనూరు: మండలంలోని కూచివారిపల్లిలో పెళ్లింట గొడవ చోటు చేసుకుని వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ నేత లింగమనాయుడు తమ్ముడి కుమారుడి పెళ్లి ఆదివారం తాడిపత్రిలో జరిగింది. అదే రోజు రాత్రి స్వగ్రామంలో తిరుగింపులు ఉండడంతో బుక్కాపురం గ్రామానికి చెందిన వారికి క్యాటరింగ్‌ అప్పగించారు. ఈ క్రమంలో క్యాటరింగ్‌ నిర్వాహకుడు తన సిబ్బంది అంకాల్‌, మరికొందరితో వంటకాలు సిద్ధం చేయించి ఆదివారం రాత్రి పెళ్లింటికి పంపాడు. అక్కడ ఆహార పదార్థాలను వాహనం నుంచి దింపే విషయంగా అంకాల్‌ తదితరులు పెళ్లింటి వారిని సాయం కోరారు. ఆ సమయంలో క్యాటరింగ్‌ సిబ్బందికి లింగమనాయుడి మధ్య గొడవ చోటు చేసుకుంది. అంకాల్‌పై లింగమనాయుడు చెయ్యి చేసుకున్నాడు. విషయాన్ని తన కుమారులు, సమీప బంధువులకు అంకాల్‌ చేరవేసి రప్పించుకున్నాడు. దీంతో పెళ్లికి హాజరైన కొడవండ్లపల్లికి చెందిన యంపలాకు శివకేశవ, అతని బావమరిది గడ్డిమడుగు సురేష్‌ సర్ధి చెబుతుండగా వారిపై క్యాటరింగ్‌ సిబ్బంది దాడికి ప్రయత్నించారు. దాడి నుంచి తప్పించుకుని శివకేశవ, సురేష్‌ ఇంటికెళ్లిపోయారు. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో శివకేశవ ఇంటికి క్యాటరింగ్‌ సిబ్బంది చేరుకుని కట్టెలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో గాయపడిన శివకేశవ ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిలో వడ్డే చౌడయ్య, అనిల్‌, అంకరాజు, పెద్దిరాజు, అంకాల్‌, కుళ్లాయప్ప, రాజు అలియాస్‌ కుంటి, అర్జున్‌, మంజులరాజు తదితరులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు.

రైల్వే ఉద్యోగులకు అవార్డులు

గుంతకల్లు: అంకిత భావంతో విధులు నిర్వర్తించిన రైల్వే ఉద్యోగులకు అవార్డులతో డీఆర్‌ఎం చంద్రశేఖర్‌ గుప్తా సత్కనించారు. ఈ నెల 8న గుంతకల్లు–బళ్లారి సెక్షన్‌లోని హద్దనిగుండి రైల్వేస్టేషన్‌ వద్ద హంపి ఎక్స్‌ప్రెస్‌ రైలు చక్రాల నుంచి వెలువడుతున్న పొగలను గుర్తించిన పాయింట్స్‌మెన్‌ అనిల్‌కుమార్‌ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు హగరి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఆపేయడంతో ట్రాక్‌ మెంటైనర్‌ అనిల్‌కుమార్‌, టెక్నీషియన్‌ విక్కీకుమార్‌ మరమ్మతులు చేసి పెను ప్రమాదాన్ని నివారించారు. ఈ విషయం తెలుసుకున్న డీఆర్‌ఎం సీఎస్‌ గుప్తా సోమవారం తన చాంబర్‌కు పాయింట్స్‌మెన్‌ అనిల్‌కుమార్‌, ట్రాక్‌ మెంటైనర్‌ అనిల్‌కుమార్‌, టెక్నీషియన్‌ విక్కీకుమార్‌ను రప్పించుకుని అవార్డులను అందజేసి, అభినందించారు.

బళ్లారిలో ప్రమాదం.. యువకుడి దుర్మరణం

బొమ్మనహాళ్‌: బళ్లారిలో చోటు చేసుకున్న ప్రమాదంలో బొమ్మనహాళ్‌ మండలానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబసభ్యులు సమాచారం మేరకు... ఉంతకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతుల కుమారుడు రవికిరణ్‌ (17) బళ్లారిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం బళ్లారికి వెళ్లిన రవికిరణ్‌ అక్కడ స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మోతీ సర్కిల్‌ వద్దకు చేరుకోగానే కేఎస్‌ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో రవికిరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన స్నేహితుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బళ్లారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పరిష్కార వేదికకు 169 వినతులు

అనంతపురం సెంట్రల్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 169 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్‌ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహబూబ్‌బాషా, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు మెగా జాబ్‌మేళా

అనంతపురం టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ శైలజ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి, ఆ పై విద్యార్హతలతోపాటు డిప్లొమా, బీటెక్‌, ఐటీఐ విద్యార్హతలున్న వారు అర్హులు. ఎంపికై న వారు బెంగళూరు, పెనుకొండ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు నగర శివారులోని పంగల్‌ రోడ్డు వద్ద ఉన్న టీటీడీసీలో బుధవారం జరిగే జాబ్‌మేళాకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement