తొలిసారి స్వీయ జనగణన | - | Sakshi
Sakshi News home page

తొలిసారి స్వీయ జనగణన

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

రాయదుర్గం టౌన్‌: దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి జనగణన చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. చివరి సారి 2011లో జనాభా లెక్కించారు. 2021లో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం 2026–27లో జన గణనను కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తోంది. అతి పెద్దదైన ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు సమాయత్తమయ్యారు.

డేటా గోప్యతకు ప్రాధాన్యత

ప్రజల వ్యక్తిగత వివరాలకు అత్యంత గోప్యతనిస్తూ ఈసారి స్వీయ గణనకు (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌)కు అవకాశం కల్పించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా జన గణనలో పాల్గొనే వెసులుబాటు దక్కింది. ఇది స్థానికంగా అందుబాటులో లేని వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. మొత్తం రెండు దశల్లో సాగనున్న ఈ ప్రక్రియలో తొలి విడతగా ఇళ్ల వివరాలు, సదుపాయాల సర్వే చేపట్టనున్నారు. మే 1 నుంచి మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కింపు ఉంటుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతుల ఆధారంగా జనగణన ఉంటుంది. తొలి సారి దేశవ్యాప్తంగా పూర్తిగా డిజిటల్‌ విధానంలో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రక్రియలో ఈ నెల 16 నుంచి ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను ఎవరికి వారే నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 30 వరకు స్వీయ గృహ గణన కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, చార్జ్‌ ఆఫీసర్లను ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో శిక్షణ కల్పిస్తున్నారు.

16 నుంచి స్వీయగణన

జనాభా లెక్కల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు లేకపోవడం, ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఈసారి కొత్తగా స్వీయ జనగణనకు అవకాశం కల్పించింది. డిజిటల్‌ సెన్సెస్‌లో భాగంగా ప్రజలు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. జనాభా లెక్కింపు అధికారులు ఇంటి వద్దకు రాకముందే ప్రజలు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. స్వీయ జనగణనకు దేశంలోని ప్రతి రాష్ట్రానికీ నిర్ణీత సమయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలోనే ఏపీలో స్వీయ గణనకు ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఉంది.

ఎలా నమోదు చేయాలంటే..

స్వీయ గణన కోసం https://se.census.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావడం ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రాష్ట్రాన్ని సెలెక్ట్‌ చేసుకుని క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్‌ నెంబర్‌ ధ్రువీకరించాలి. భాషను ఎంపిక చేసుకుని ఓటీపీ నమోదు చేయాలి. లొకేషన్‌ వివరాలను నమోదు చేశాక కుటుంబానికి సంబంధించిన వివరాల గురించి 33 ప్రశ్నలకు సమాధానాలు నింపాలి. ఇందులో సొంత ఇల్లు ఉందా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఎల్‌పీజీ గ్యాస్‌ వాడుతున్నారా? కారు లేదా బైక్‌ ఉందా లాంటి ప్రశ్నలుంటాయి. అన్ని వివరాలను నమోదు చేశాక ఒకసారి ప్రివ్యూ చూసుకుని ఫైనల్‌ సబ్మిషన్‌ బటన్‌ నొక్కాలి. 11 అంకెల సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఐడీ జనరేట్‌ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ నంబర్‌ చెబితే సరిపోతుంది. ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు, మార్పులు ఉంటే ఎన్యుమరేటర్‌ సమక్షంలో సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

డిజిటల్‌ జనగణన కోసం

ప్రత్యేక కార్యాచరణ

ప్రజలే నమోదు చేసుకునేలా

వెసులుబాటు

ఎక్కడి నుంచైనా

‘సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌’కు అవకాశం

సొంతూళ్లలో లేని వారికి ఉపయుక్తం

Advertisement
 
Advertisement
Advertisement