కళ్యాణదుర్గం: స్థానిక యూనియన్ బ్యాంక్‌లోని మేనేజర్ చాంబర్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... యూనియన్ బ్యాంక్‌లోని తన ఖాతాలో రూ. లక్షల కోట్లు ఉన్నాయంటూ నకిలీ పత్రాలు చూపి జనాన్ని మోసం చేస్తున్నారన్న అభియోగంపై కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని పార్వతీనగర్‌లో నివాసముంటున్న ఒంటిమిద్ది ఎర్రిస్వామిని రెండు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా స్థానిక ఆ బ్యాంక్ అధికారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. దీంతో మనస్తాపానికి లోనైన ఎర్రిస్వామి భార్య జ్యోతి సోమవారం మధ్యాహ్నం యూనియన్ బ్యాంక్ కు చేరుకుని మేనేజర్‌తో మాట్లాడారు. తన భర్తకు సంబంధంలేని వ్యవహారంలో టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమంగా ఫిర్యాదు చేశారంటూ వాపోతూ అప్పటికే తన వెంట తెచ్చుకున్న గుర్తు తెలియని మాత్రలు మోతాదుకు మించి మింగేసింది. గమనించిన బ్యాంక్ సిబ్బంది, జ్యోతి బంధువులు వెంటనే ఆమెను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు.
మానవ హక్కుల సంఘాన్ని
ఆశ్రయించిన బాధితురాలు
టీడీపీ నేతల ఆదేశాలతోనే తన భర్తపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ ఎర్రిస్వామి భార్య జ్యోతి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఆన్‌లైన్ ద్వారా రెండు రోజుల క్రితం తన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం కమిషనర్‌కు ఆమె పంపారు. డీఎస్పీ రవిబాబు, పట్టణ సీఐ హరినాథ్ సిబ్బంది తమ ఇంటి వద్దకు వచ్చి ఎలాంటి నోటీసు, వారెంట్ లేకుండానే సరైన కారణం చూపకుండా తన భర్త ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. తన భర్తను చూసేందుకు అనుమతి కూడా ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసులో నేరాన్ని అంగీకరించాలంటూ తన భర్తను శారీరకంగా, మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ నేతల ఒత్తిళ్లతో తన భర్తపై అక్రమ కేసు బనాయించారంటూ యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఎదుట ఆవేదన
మేనేజర్ చాంబర్‌లోనే మోతాదుకు మించి మాత్రలు మింగిన బాధితురాలు


