అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య మాట్లాడుతూ జిల్లాలో సుమారు 50 శాతం మంది మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. అయితే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాఠశాలల్లో వాష్‌రూమ్‌లు, టాయిలెట్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించేందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కౌన్సిలర్లను నియమించాలన్నారు. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో సౌలభ్యం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, జిల్లా కార్యదర్శి అర్జున్, సీనియర్ నాయకులు నాగేంద్ర, శ్రీనివాసులు, బసవరాజు, అనిల్ కుమార్, సురేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పాల్గొన్నారు.
మతిస్థిమితం లేని మహిళ మృతి
ఉరవకొండ: మండల పరిధిలోని చిన్నమూష్టూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మతిస్థిమితం లేని మహిళ (30 నుంచి 40 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం సీఐ మహానంది మాట్లాడుతూ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని మహిళ హంద్రీనీవా కాలువ గట్ల వద్ద ఉంటూ తిరిగేదన్నారు. ఆహారం లేక ఎండ వేడిమికు తట్టుకోలేక కాలువ సమీపంలోని చెట్టు కింద మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యాచకురాలు మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
కదిరి అర్బన్: మండల పరిధిలోని కాళసముద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన రామాంజినేయులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


