రాప్తాడురూరల్: రాప్తాడు మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన రాజశేఖర్ (40) మామిళ్లపల్లి వైపు నుంచి జాతీయ రహదారిపై రాప్తాడు వైపు బైకులో వస్తున్నాడు. ఎం.చెర్లోపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
బైకు అదుపుతప్పి...
యల్లనూరు: యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన మారుతి తన సోదరి మమతతో పాటు ఆమె కుమారుడు గగన్ (5)తో కలిసి రాప్తాడు వైపు నుంచి అనంతపురం వైపు బైకులో వస్తున్నారు. అయితే గాయత్రి మిల్క్‌డైరీ సమీపంలో అదుపుతప్పి బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గగన్ తలకు తీవ్ర గాయాలై మృత్యువాతపడ్డాడు. మారుతి, మమత గాయాలతో బయటపడ్డారు. తన కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలను పరిశీలించారు.
రోడ్డు ప్రమాదంలో రైతు...
కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన మహలింగప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన చిలగడ దుంపలను హైదరాబాద్ మార్కెట్‌కు బొలెరోలో తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రి కర్నూలు సమీపంలో బొలెరో వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మహలింగప్ప అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు.


