అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ిపీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక 10వ తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద రూసో జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఏపీ పీఎస్ హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ిపీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌టీఏ జిల్లా అధ్యక్షుడు జయరాం నాయక్, కార్యదర్శి రవీంద్రబాబు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి డెగావత్ రవి మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పింఛను ఉద్యోగుల హక్కు అని పేర్కొన్నారు.


