అనంతపురం అగ్రికల్చర్: పట్టు పరిశ్రమ శాఖ ఉద్యోగుల పరపతి సంఘం అధ్యక్షుడిగా డి.ఓబులేసు, కార్యదర్శిగా సి.ఆదినారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.బసవరాజు ఏకగీవ్రంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎ.సర్ఫరాజ్ నవాజ్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికై న ఏడుగురు డైరెక్టర్లు శనివారం స్థానిక పట్టుశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న సొసైటీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నోటిఫికేషన్ మేరకు ఆఫీస్ బేరర్ల ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. డైరెక్టర్లుగా జి.రామలింగారెడ్డి, బి.గోవిందప్ప, కె.బాబయ్య, జీవీ శివప్రసాద్ కొనసాగనున్నారు. నూతన కార్యవర్గాన్ని ఆ శాఖ ఉద్యోగులు అభినందించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని అధ్యక్షుడు ఓబులేసు, కార్యదర్శి ఆదినారాయణరెడ్డి తెలిపారు.
చిన్నారి దుర్మరణం
కణేకల్లు: బతుకు తెరువు కోసం తల్లిదండ్రులతో కలసి వలస వెళ్లిన ఓ చిన్నారి... మహానగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన శాంతి, చిన్న మారెన్న బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లి, భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరి వెంట కుమారుడు నిషాంత్ (7) కూడా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మహదేవపురలో సైకిల్‌పై వెళుతున్న నిషాంత్‌ను ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెల్ ఢీకొంది. ఘటనలో వాహనం చక్రాల కిందపడి నిషాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వ్యక్తిని కాపాడిన
రైల్వే పోలీసులు
తాడిపత్రి రూరల్: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని సకాలంలో రైల్వే పోలీసులు గుర్తించి కాపాడారు. వివరాలు.. కూలి పనులతో జీవనం సాగిస్తున్న నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లికి చెందిన శివశంకర్‌రెడ్డి మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం సేవిస్తున్న కారణంగా అనారోగ్యం బారిన పడ్డాడు. పనులు సైతం చేయడానికి శరీరం సహకరించకపోవడంతో మనోవేదనకు లోనైన శివశంకరరెడ్డి శనివారం తాడిపత్రిలోని రైల్వే స్టేషన్‌కు చేరుకుని ప్లాట్‌ఫారం చివర అనుమానాస్పదంగా తచ్చాడుతుండడంతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని ఆరా తీశారు. దీంతో తాను పడుతున్న ఇబ్బందులను శివశంకరరెడ్డి ఏకరవు పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే తనకు మార్గమని పేర్కొన్నాడు. దీంతో వెంటనే శివశంకరరెడ్డిని జీఆర్పీ స్టేషన్‌కు తరలించి, కుటుంబసభ్యులను రప్పించుకున్నారు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.
కుడి కాలువకు
నీటి సరఫరా నిలుపుదల
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ నుంచి ధర్మవరం కుడికాలువ ద్వారా నీటి సరఫరాను శనివారం నిలుపుదల చేశారు. ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజక వర్గ పరిధిలోని కాలువ పరిధిలోని 49 చెరువులను నీటితో నింపినట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకరరావు వెల్లడించారు. శనివారం ఆయన రిజర్వాయర్‌ను పరిశీలించి, నీటి మట్టం, అవుట్ ఫ్లో వివరాలను సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నీరు తాగునీటి ప్రాజెక్ట్‌లకు సరిపోతుందన్నారు. కార్యక్రమంలో రిజర్వాయర్ డీఈ కవిత, జేఈలు ఓబుళరెడ్డి, గంగమ్మ, మిడ్ పెన్నార్ డ్యాం జేఈ సురేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
మైనర్‌పై తండ్రి అత్యాచారయత్నం
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని ఓ కాలనీలో ఇంటర్ చదువుతున్న బాలికపై తండ్రి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి తండ్రి మద్యం మత్తులో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో గమనించిన తల్లి అడ్డుకుంది. ఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమెదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


