● ‘బ్రిలియంట్ ఇంగ్లిష్ యూసేజ్’ పుస్తకావిష్కరణలో వక్తలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖలో శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగ విరమణ చేసిన జిల్లాకు చెందిన చిలుకూరి కుమారస్వామిరెడ్డి ఆత్మీయ సభ అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఘనంగా జరిగింది. ముందుగా కుమారస్వామిరెడ్డి రచించిన ‘బ్రిలియంట్ ఇంగ్లిష్ యూసేజ్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం వ్యక్తి సంపూర్ణ అవసరాలు తీరుస్తుందని వక్తలు కొనియాడారు. ఏ పదాలు ఎలాంటి సందర్భంలో వాడాలో ఈ పుస్తకంలో చాలా చక్కగా, సరళంగా వివరించారన్నారు. వేలాది పదాలు ఇందులో చేర్చడం గొప్ప విషయమన్నారు. దీని వెనుక ఏళ్లతరబడి దాగి ఉన్న కుమారస్వామిరెడ్డి శ్రమను అభినందించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా తిరుపతి విశ్రాంత కలెక్టర్ వెంకట రమణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అదనపు కమిషనర్ రవికుమార్, ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి, నెల్లూరు జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మానవత కన్వీనర్ తరిమెల అమర్నాథ్ రెడ్డి, పాస్టర్ గోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. విశ్రాంత కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఇతర శాఖలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ శాఖలో ఇంత ఘనంగా ఉద్యోగ విరమణ సభ జరగడం చాలా అరుదన్నారు. ఇది కుమారస్వామిరెడ్డి సేవా నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘బ్రిలియంట్ ఇంగ్లిష్ యూసేజ్’ పుస్తకం ప్రతి ఇంట్లో, ప్రతి లైబ్రరీలో ఉండాల్సిన గ్రంథమని తెలిపారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ... కుమారస్వామిరెడ్డి సేవా కార్యక్రమాలను వివరించారు. ఉద్యోగ జీవితంలో సహకరించిన సహోద్యోగులు, ఉన్నతాధికారులు, మిత్రులకు కుమారస్వామి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మిత్రబృందం, సహోద్యోగులు, బంధుమిత్రులు, అభిమానులు భారీగా హాజరయ్యారు.


