పూలే మార్గం అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

పూలే మార్గం అనుసరణీయం

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: సమసమాజ నిర్మాణానికి అనేక పోరాటాలు సాగించిన మహాత్మా జ్యోతిబాపూలే మార్గం అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. పూలే 200వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జెడ్పీ కార్యాలయ ఆవరణలోని పూలే విగ్రహానికి కలెక్టర్‌ ఓ.ఆనంద్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీపీఆర్‌సీ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, విద్యకు జ్యోతిబా పూలే ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సమాన హక్కులు, అవకాశాల కోసం పూలే సాగించిన పోరాటాలను కొనియాడారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ చదువు హక్కు ఉందని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడిగా పూలే నిలిచారన్నారు. పూల నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పూలే విగ్రహాల ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ సభ్యుడు పి. వెంకటప్ప, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్‌ వెంకటశివుడు యాదవ్‌, బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జ్‌ డీడీ రామసుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కమలమ్మ, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

అనంతపురం సెంట్రల్‌: అప్పులు తీర్చే మార్గం కానరాక అనంతపురంలోని కోవూరునగర్‌లో నివాసముంటున్న నిరంజన్‌కుమార్‌(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న నిరంజన్‌కుమార్‌ను గమనించిన కుటుంబసభ్యులు గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నాల్గో పట్టణ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.

గోల్‌షాట్‌ బాల్‌ పోటీల్లో అనంత శుభారంభం

కదిరి అర్బన్‌: స్థానిక ఓ ప్రైవేట్‌ పాఠశాల క్రీడా మైదానం వేదికగా జూనియర్‌ బాలబాలికల అంతర్‌ జిల్లాల గోల్‌షాట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉత్కంఠగా సాగిన పోటీల్లో బాలుర విభాగంలో విశాఖపట్నంపై అనంతపురం జట్టు విజయం సాధించింది. అలాగే బాపట్లపై విశాఖపట్నం, శ్రీసత్యసాయిపై గుంటూరు, కర్నూలుపై తిరుపతి, జట్లు విజయం సాధించాయి. బాలికల విభాగంలో గుంటూరుపై శ్రీసత్యసాయి జట్టు, బాపట్లపై విశాఖపట్నం జట్టు విజయం సాధించాయి.

Advertisement
 
Advertisement
Advertisement