● జస్టిస్ రాజేంద్ర మీనన్
అనంతపురం: సమాజ నిర్మాణంలో చట్టం కీలక పాత్ర పోషిస్తుందని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆర్మ్‌డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చైర్మన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర మీనన్ అన్నారు. అనంతపురంలోని విజయనగర లా కళాశాలలో నూతన అకడమిక్ భవనాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మీనన్ మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైందన్నారు. చట్టబద్ధమైన వాదనల ద్వారా న్యాయాన్ని నిలబెట్టే ఈ వృత్తిలో కొనసాగడమంటే సమాజానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం దక్కినట్లేనని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలంటే సహనం, ఓర్పు ఉండాలన్నారు. జడ్జిమెంట్‌కు సంబంధించి ఏఏ పుస్తకాలు చదవాలో వివరించారు. జర్నల్స్, లా బుక్స్ నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే.. సమాజ సేవకు కృషి చేయాలని కోరారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో విజయనగర లా కళాశాల కరస్పాండెంట్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ఆలూరి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


