● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి
రాయదుర్గంటౌన్: పీఆర్‌సీ సాధనకు ఈ నెల 18న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో రాయదుర్గం ఏపీటీఎఫ్ జోనల్ సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాతిరెడ్డి హాజరై, మాట్లాడారు. పీఆర్‌సీ నియమించకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే కమిషన్ నియమించి ఐఆర్, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. రాబోవు బదిలీల్లో జీరో సర్వీస్ అవకాశం ఇవ్వాలని, రెండేళ్లకోసారి రేషనలైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని, విద్యా వ్యవస్థలో గందరగోళం తొలగించి పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, అనిల్‌కుమార్, రంగప్ప, ఖాసీంపీరా, మల్లికార్జున, ఆంజనేయులు, సునీల్, పాండు, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


