గార్లదిన్నె: జిల్లాలో ఆపిల్ పంట సాగు చేయడం శుభపరిణామమని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గార్లదిన్నె మండలం కోటంకలో రైతు రమణారెడ్డి సాగు చేసిన ఆపిల్ తోటను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పంట సాగు విధానాలపై రైతుతో ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఆపిల్ మొక్కలు నాటాలని ఎవరూ తొందర పడరాదన్నారు. ముందుగా జిల్లాలో ఆపిల్ సాగుపై శాసీ్త్రయంగా ఉద్యానశాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా విశ్లేషణ చేసిన తర్వాత ఆశాజనక ఫలితాలు వస్తే పంట సాగుకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈరమ్మ, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఉద్యాన అధికారి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
యంత్ర పరికరాలపై శిక్షణ ప్రయోజనకరం
గార్లదిన్నె: దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ, పరీక్షణ సంస్థ (ట్రాక్టర్ నగర్)లో నిరుద్యోగ యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయంటూ కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గార్లదిన్నె పరిధిలోని ట్రాక్టర్ నగర్‌ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. సంస్థలోని మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. శిక్షణకు వచ్చిన మహారాష్ట్ర యువతతో పాటు స్థానిక రైతులతో మాట్లాడారు. ట్రాక్టర్ నగర్ సేవలపై ఆరా తీశారు. సంస్థ కార్యకలాపాలు, సాధించిన విజయాలు, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సాహించే విధానాలు, తదితరాలను ట్రాక్టర్ నగర్ డైరెక్టర్ పీపీ రావు వివరించారు. గర్‌ల్స్, బాయ్స్ హాస్టల్, ఆడి టోరియం నిర్మాణ పనులు జరుగుతున్నట్లు డైరెక్టర్ తెలిపారు. అనంతరం డైరెక్టర్‌తో కలసి అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. యంత్ర పరికరాలపై శిక్షణ, ప్రదర్శన, నాణ్యత పరీక్షల సేవల్లో ట్రాక్టర్‌నగర్ ప్రత్యేక స్థానం దక్కించుకోడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో శిక్షణకు వచ్చిన యువతతో పాటు ట్రాక్టర్ నగర్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
విధి నిర్వహణలో అలసత్వం వీడండి
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సచివాలయ ఉద్యోగులను కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామ సచివాలయాన్ని శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల ప్రగతిపై ఆరా తీశారు. కొందరు ఉద్యోగులు సీట్లలో కనిపించకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లారంటూ అక్కడున్న వారిని ప్రశ్నించారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. పనిపై కార్యాలయానికి వెళితే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. బోర్లలో నీరు అడుగంటి చెట్లు ఎండిపోతున్నాయని, మిడ్‌పెన్నార్ డ్యాం నుంచి వృథాగా నీటిని పెన్నానదికి వదిలారని, దక్షిణ కాలువకు నీరు వదిలితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని విన్నవించారు.


