ఆత్మకూరు: ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు ఓ క్షేత్ర సహాయకుడికి డ్వామా పీడీ సలీమ్‌బాషా శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద చేపట్టిన ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. కూలీలు పనులకు సరిగా హాజరు కాకపోవడాన్ని గమనించి సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎండలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని కూలీలకు సూచించారు. పని ప్రాంతంలో తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
జనగణన పక్కాగా నిర్వహించాలి
● జేసీ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం అర్బన్: జన గణనలో భాగంగా మొదటి దశలో చేపట్టే గృహగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. మండల, పట్టణ స్థాయిలో జన గణన ప్రక్రియలో పాల్గొననున్న సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించి, మాట్లాడారు. విధానాల రూపకల్ప, దేశాభివృద్ధికి ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, ప్రజాసంక్షేమం, సమర్థవంతమైన పాలనకు పునాదిగా జనగణన ప్రక్రియ ఉంటుందన్నారు. ఇంటింటా కచ్చితమైన గణాంకాలు, వివరాలు సేకరించినప్పుడే జనగణన ముఖ్యలక్ష్యం సాధ్యమవుతుంనద్నారు. భారత ప్రభుత్వం నిర్ధేశించిన 33 అంశాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి ఏ రోజుకారోజు నమోదు ప్రక్రియ ముగిసేలా ప్రణాళికబద్ధంగా పనిచేయాలన్నారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు వ్యక్తిగత వివరాలను వెబ్‌సైట్‌లో సొంతంగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని, ఈ విషయంపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్దారు రాజా, సెన్సెస్ డీటీ మధుసూదన్‌రావు, ఆర్‌ఐ యువతేజ, జేఏ షఫీ, ట్రైనర్లు రామచంద్ర, అహమ్మద్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాల ఢీ – ముగ్గురికి గాయాలు
గార్లదిన్నె: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం బూదేడు గ్రామానికి చెందిన మోహన్, తన భార్యతో కలసి శుక్రవారం ద్విచక్ర వాహనంపై పామిడికి బయలుదేరాడు. ఎగువపల్లి సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై కోటంక గ్రామానికి చెందిన నాగరాజు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నారు. అటుగా వెళుతున్న వారు గమనించి గాయపడిన ముగ్గురినీ 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


