ఘనంగా జిల్లా స్థాయి ఈఎండీపీ ఎక్స్‌పో | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జిల్లా స్థాయి ఈఎండీపీ ఎక్స్‌పో

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా స్థాయి ఎంట్రప్రెన్యూర్‌ మైండ్‌ సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఈఎండీపీ) ఎక్స్‌పో కార్యక్రమం జిల్లా సైన్స్‌ సెంటర్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. పారిశ్రామికవేత్తల ఆలోచనా విధానాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు తమ వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. తిమ్మంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు ఎస్‌.షాహీన, టి.రాణి ప్రదర్శించిన ‘టమాట పీల్స్‌ రీసైక్లింగ్‌’ నమూనా ప్రథమ బహుమతిని అందుకుంది. వెంకటాపురం జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు సి.కావ్య, ఎస్‌.సుమకామిని రూపొందించిన ‘సోలార్‌ ఐరనింగ్‌ కార్ట్‌’ నమూనా ద్వితీయ బహుమతిని సాధించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పారిశ్రామికవేత్తల లక్షణాలు అలవడేలా 9వ తరగతి టైమ్‌ టేబుల్‌లోనే ఈఎండీపీ పీరియడ్స్‌ కేటాయించినట్లు వెల్లడించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఎక్స్‌పోలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు, సైన్స్‌ క్యూరేటర్‌ బాలమురళి, ఈఎండీపీ జిల్లా కోఆర్డినేటర్‌ గోపాల్‌, ఎన్‌జీసీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ ఆనంద భాస్కర్‌ రెడ్డి, ఏఎంఓ వేణుగోపాల్‌, ఆర్ట్స్‌ కాలేజీ అధ్యాపకులు జీఎల్‌ఎన్‌ ప్రసాద్‌, కిరణ్‌, డీఎస్‌ఓ ఎన్‌. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement