ఏపీ గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోండి
గుత్తి: ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరీక్షల విభాగం సమన్వయకర్త, గుత్తి ఏపీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతి కోరారు. గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఐదవ తరగతితో పాటు మిగిలిపోయిన 7, 8, 9 తరగతుల్లో సీట్లు, అదే విధంగా ఇంటర్, డిగ్రీలలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్షలునుంటాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఘనంగా వసంతోత్సవం
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వసంతోత్సవం శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఉత్సవాలు వసంతోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం, మంగళహారతి, మహారుద్రాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కంకణ మండపంలో మట్టికుండల్లో బాగా పండిన నవధ్యానాల మొక్కలను తీసి ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తిని గవిమఠం పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ అధ్వర్యంలో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు.
రేషన్ పంపిణీ
సక్రమంగా చేపట్టాలి
● జేసీ విష్ణుచరణ్
అనంతపురం అర్బన్: కార్డుదారులకు ఆదివారం నుంచి బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. రేషన్ పంపిణీపై జేసీ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక ధరల దుకాణాల్లో 15వ తేదీ వరకు కచ్చితంగా సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు బియ్యానికి బదులుగా జొన్నలు, రాగులు 3 కిలోల వరకు చితంగా పొందవచ్చన్నారు. మునిసిపాలిటీలు, అనంతపురం రూరల్ మండలంలోని కార్డుదారులకు మాత్రమే గోధుమ పిండి కిలో రూ.20 చొప్పున పంపిణీ చేస్తారన్నారు.
జాతీయ రహదారిపై
భారీగా నగదు చోరీ?
● రహస్యంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి సమీపంలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్44)పై వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం సూరత్‌కు చెందిన వ్యాపారి ప్రతీక్ పాటిల్ తన డ్రైవర్ అర్జిత్ పటేల్‌తో కలిసి ఫిబ్రవరి 22వ తేదీన ఇన్నోవా కారులో వారణాసి నుంచి బెంగళూరు బయలు దేరాడు. వ్యాపారం నిమిత్తం వెంట రూ.3 కోట్ల నగదు తీసుకు వెళ్తున్నాడు. అయితే వీరి వాహనం 22వ తేదీ తెల్లవారుజామున మామిళ్లపల్లి సమీపానికి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు మూడు వాహనాల్లో వారి వాహనాన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక రోడ్డుపైనే ప్రతీక్‌పాటిల్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకుని రూ.3 కోట్ల నగదు చోరీ చేయడంతో పాటు వ్యాపారి ప్రతీక్ పాటిల్‌ను ఓ చోట ఆయన డ్రైవర్ అర్జిత్ పటేల్‌ను మరో ప్రాంతంలో వదిలి పెట్టినట్లు తెలిసింది. అనంతరం బాధితులు ఈనెల 24వ తేదీన కనగానపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. సీఐ శ్రీధర్, ఎస్‌ఐ మహమ్మద్ రిజ్వాన్ బాధితులను వెంట పెట్టుకొని క్లూస్ టీంతో రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
ఏపీ గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోండి


