సీమ ఎత్తిపోతలపై వైఎస్సార్‌సీపీ ఉద్యమం
● నేడు కడపలో 10 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం
● కార్యాచరణ ప్రణాళికతో ఉద్యమానికి బాటలు
కడప కార్పొరేషన్: రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన సీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. ఇటీవల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఉదయం 10 గంటలకు కడప శివారులోని రామాంజనేయపురంలో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్‌లో భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర కో ఆర్డినేటర్ సాకే శైలజానాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, పార్టీ సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని వైఎస్సార్ కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులంతా సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, ‘సీమ’కు ప్రాణప్రదమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వ మెడలు వంచి పూర్తి చేయించేందుకు చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, సభలు వంటి కార్యక్రమాలను ఇందులో తీర్మానించనున్నారు.


